NTV Telugu Site icon

Tragedy : కోట్లు సంపాదించిపెట్టారు.. కొడుకులు కూడు పెట్టకపోవడంతో ఉసురుతీసుకున్నారు

New Project

New Project

Tragedy : కోటి విద్యలు కూటి కోసం మాత్రమే అనే సామెత వినే ఉంటారు. ఎన్ని వందల వేల కోట్లు సంపాదించినా జానెడు పొట్టకు తిండి లేకపోతే ఎంత కష్టపడినా వృథా. నేటి సమాజంలో మానవ సంబంధాలన్నీ మనీ బంధాలే. ప్రతీ వ్యక్తి తన స్వార్థం కోసం మాత్రమే ఇతరులపై ఆధారపడతాడు. అది బయట వారు మాత్రమే కాదు… కడుపున పుట్టినవారు, తోబుట్టువులు కూడా అంతే. ఇది హర్యానాలో జరిగిన సంఘటనతో స్పష్టమైంది.

హర్యానాలోని చర్ఖీ దాద్రి జిల్లాలో డెబ్భై ఏళ్ల వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు తమ మరణానికి కారణం ఏమిటో ఓ లేఖలో తెలిపారు. తమ పిల్లలే వారి చావుకి కారణమని లేఖలో పేర్కొన్నారు. 2021 బ్యాచ్ కి చెందిన హరియాణా కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ పేరెంట్స్, ఇతర కుటుంబ సభ్యులు తమను చూసుకోవడం లేదని.. కనీసం వేళకు తిండి కూడా పెట్టడం లేదని లేఖ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. జగదీష్ చంద్ర, ఆయన సతీమణి బాగ్లీ బాద్రాలోని గోపీ గ్రామంలో జీవించేవారు. తన కొడుకులకు పట్టణంలో 30 కోట్ల ఆస్తి ఉన్నా తమకు అన్నం పెట్టడంలేదని లేఖలో రాశారు. తమపై దౌర్జన్యం చేసిన కొడుకు, కోడళ్ళకు శిక్ష పడినప్పుడే చనిపోయిన మా ఆత్మలకు శాంతి చేకూరుతుందని రాసుకొచ్చారు.

Read Also: Pawan Kalyan: ఉస్తాద్ డైరెక్టర్ కు పవన్ స్పెషల్ విషెస్

తన ఆస్తులన్నీ స్థానిక ఆర్య సమాజ్ కు విరాళంగా ఇవ్వాలని కోరారు.సొంత కొడుకుల చేతిలో అవమానం భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నాం అని రాసుకొచ్చారు. నీలం, వికాస్, సునీత, వీరేందర్ తమ చావుకు కారణమని వెల్లడించారు. ‘ఈ ప్రపంచంలో ఏ పిల్లలూ తమ తల్లిదండ్రులపై ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడరు. నా లేఖ చదివే వారికి, ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే.. వారిని ఖచ్చితంగా శిక్షించాలి. అప్పుడే తమ ఆత్మలకు శాంతి చేకూరుతుంది’ అంటూ రాసుకొచ్చారు. ఈ ఆత్మహత్య లేఖ ఆధారంగా పోలీసులు నలుగురి మీద కేసులు నమోదు చేశారు. మృతుల మనవళ్లలో ఒకరు ఐఏఎస్ అధికారి కాగా మరొకరు ఆర్మీలో సైనిక అధికారిగా ఉన్నారు.

Show comments