NTV Telugu Site icon

Vontimitta Kodandarama Swamy: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల‌ క‌ల్యాణం

Vontimitta

Vontimitta

ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం సాయంత్రం శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జ‌రిగింది. వేలాదిగా హాజరైన భక్తులు స్వామివారి క‌ల్యాణోత్సవాన్ని తన్మయత్వంతో తిల‌కించారు. రాములవారి కల్యాణానికి సంబంధించి సీతమ్మవారి కోరికను శాస్త్రరీత్యా తెలిపే కాంతకోరిక కార్యక్రమాన్ని 6 గంటలకు వేదిక మీద అర్చకులు నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ముందుగా భగవత్‌ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ, లోకకల్యాణం కోసం సంకల్పం చేయించారు. కల్యాణంలోని పదార్థాలన్నీ భగవంతుని మయం చేసేందుకు పుణ్యాహవచనం నిర్వహించారు.

READ MORE: Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

ఆ తరువాత రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, వరప్రేశనం(కన్యావరణం), మధుపర్కార్చనం చేశారు. మహాసంకల్పం అనంతరం కన్యాదానం చేసి సీతారామచంద్రుల ప్రవరలను చదివారు. రాములవారి వంశస్వరూపాన్ని స్తుతించారు. అగ్నిప్రతిష్టాపన తరువాత సీతా రాముల తల మీద జీలకర్ర, బెల్లం ఉంచి శాస్త్రోకంగా కల్యాణ వేడుక నిర్వహించారు. తరువాత మంగళాష్టకం, చూర్ణిక పఠించి, మాంగళ్యసూత్ర పూజ, మంగళసూత్రధారణ, అక్షతారోపణం చేప‌ట్టారు. స్వామి నివేదన, వేదస్వస్తి, మహదాశీర్వచనంతో కల్యాణఘట్టం పూర్తయింది.

READ MORE: Krishna District: అలర్ట్.. 40 మందికి పైగా క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్..

వైభవంగా శ్రీ సీతారాముల ఉత్సవర్ల శోభాయాత్ర
స్వామివారి కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం శ్రీ సీతారాముల ఉత్సవమూర్తుల శోభాయాత్ర ఆలయం నుంచి కల్యాణవేదిక వరకు వైభవంగా జరిగింది. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్ర వేడుకగా సాగింది. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో శ్రీ సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. కల్యాణవేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో కూర్చుని శ్రీ సీతారాముల క‌ల్యాణాన్ని తిలకించేందుకు విచ్చేసిన భ‌క్తులంద‌రికి శ్రీ‌వారి సేవ‌కులు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం, ముత్యంతో కూడిన త‌లంబ్రాల‌ను పంపిణీ చేశారు.