NTV Telugu Site icon

Madhu Yaskhi Goud : అవినీతి అధికారుల లిస్ట్ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు చేరింది

Madhu Yashki

Madhu Yashki

Madhu Yaskhi Goud : తెలంగాణ రాజకీయ వర్గాల్లో మరోసారి అధికారుల తీరుపై చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ప్రభుత్వం పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించగా, అధికారంలో ఉన్న కొన్ని కీలక విభాగాల్లో ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అడ్డుగా వ్యవహరిస్తూ, ప్రతిపక్ష పార్టీతో కుమ్మక్కై సున్నితమైన సమాచారాన్ని లీక్ చేస్తున్నారు అని ఆరోపించారు.

గత ప్రభుత్వ హయాంలో పెత్తనం చేసిన అధికారులు ఇంకా కొనసాగుతుండటమే ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తోందని మధుయాష్కీ వ్యాఖ్యానించారు. “బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కీలకంగా వ్యవహరించిన వారిని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంటెలిజెన్స్ విభాగం కూడా చాలా చోట్ల విఫలమైంది. ప్రభుత్వ పరిపాలనలో అవినీతిపరుల వల్లే చెడ్డపేరు వస్తోంది” అని ఆయన స్పష్టం చేశారు.

AFG vs SA: సౌతాఫ్రికా భారీ స్కోరు.. ఆఫ్ఘనిస్థాన్ టార్గెట్ ఎంతంటే..?

ఆధికార వ్యవస్థలో అవినీతి బహిర్గతమవుతోందని మధుయాష్కీ తెలిపారు. “అవినీతి అధికారుల లిస్ట్ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు చేరింది. ఇకపై వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది” అని అన్నారు. “ఇటీవల భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్య కేసులో పోలీసులు విఫలమయ్యారు. అదే విధంగా రాష్ట్రంలో విచారణ చేయాల్సిన అధికారులే అవినీతికి పాల్పడటంతో, విచారణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు” అని పేర్కొన్నారు.

“సోమేష్ కుమార్ వ్యవహారం ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఆయన అండతోనే జీఎస్టీ కుంభకోణం జరిగింది. రాష్ట్ర నిధులను దోచిపెట్టిన వారిని ప్రభుత్వ పెద్దలు కాపాడుతున్నారు. దోచుకున్నవారిని అడ్డగించే స్థానంలోనే విచారణ జరిపే అధికారులే ఉన్నారు” అని మధుయాష్కీ విమర్శలు గుప్పించారు.

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. “బ్యూరోక్రాట్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి, సమస్యలు తెలుసుకోవాలి. కానీ, సీఎం చెప్పినప్పుడు ‘అవునంటూ’ తల ఊపి, ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. గురుకులాల్లో నెలకొన్న సమస్యలు తెలుసుకోవడానికి అధికారులు రెగ్యులర్‌గా తనిఖీలు చేయాలని, నెలలో ఒక్కరోజైనా అక్కడే బస చేసి పిల్లలతో సమయం గడపాలని సీఎం సూచించారు. కానీ, ఇప్పటి వరకు కేవలం ఇద్దరు కలెక్టర్లు మాత్రమే ఆ మార్గంలో నడుస్తున్నారు. మిగతా అధికారులంతా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు” అని మండిపడ్డారు.

Bhatti Vikramarka : సంక్షేమమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం.. అద్దెలు, డైట్ ఛార్జీలు పెండింగ్‌లో పెట్టవద్దు