విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినులను వేధిస్తున్నాడంటూ తల్లిదండ్రులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని తల్లిదండ్రులు జగిత్యాల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో హెచ్ఎం గా విధులు నిర్వహిస్తున్న గంగారెడ్డి అనే ఉపాధ్యాయుడు పదో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ భయ భ్రాంతులకు గురిచేస్తున్నాడని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఆరోపించారు.
READ MORE: Visakhapatnam: విశాఖలో మేయర్పై అవిశ్వాస తీర్మానం నోటీసుల్లో కొత్త ట్విస్ట్!
తరగతి గదిలో విద్యార్థులను కులం పేరుతో హేళన చేస్తూ చులకనగా మాట్లాడుతున్నాడని, విద్యార్థినులు సంప్రదాయబద్ధంగా తయారై పాఠశాలకు వచ్చినప్పుడల్లా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని తెలిపారు. పాఠశాలకు వెళ్ళాలంటేనే విద్యార్థినులు భయపడుతున్నారంటూ, ఇలాంటి ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డీఈఓతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా జగిత్యాల రూరల్ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
READ MORE: Coolie Movie : విడుదలకు ముందే చరిత్ర సృష్టించిన రజినీకాంత్ ‘కూలీ’