NTV Telugu Site icon

Gorantla Butchaiah Chowdary: మేం అధికారంలోకి రాగానే టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు..!

Gorantla Butchaiah Chowdary

Gorantla Butchaiah Chowdary

Gorantla Butchaiah Chowdary: వైసీపీ మేనిఫెస్టో ఒక చెత్తలా ఉందని విమర్శించారు టీడీపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి. జగన్ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయలేదనీ, ఇది దగా కోరు ప్రభుత్వమని ఆయన అన్నారు. మద్యనిషేధం అమలు చేస్తానని చెప్పి దానిమీదే వ్యాపారం చేస్తున్న ఘనుడు జగన్ అంటూ మండిపడ్డారు. రేపటి నుంచి టైటాలింగ్ చట్టం అమల్లోకి వస్తుందనీ, ఈ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ చాలా దారుణమని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టైటలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రకటించారు. రాజమండ్రిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తయిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించకుండా, వారి వద్ద నుంచి పట్టాలు వెనక్కి తీసుకుని వాటిని కూడా తాకట్టు పెట్టి.. జగన్ ప్రభుత్వం అప్పులు తెచ్చిందని విమర్శించారు.

Read Also: Thatikonda Rajaiah: ఎన్ కౌంటర్ లు చేయించిన చరిత్ర కడియం ది.. రాజయ్య కీలక వ్యాఖ్యలు

ఇక, కూటమి ప్రభుత్వం రాకుండా అడ్డుకునేందుకు సీఎం జగన్ అనేక కుతంత్రాలు, కుట్రలు చేస్తున్నాడని దుయ్యబట్టారు బుచ్చయ్య. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు చైతన్యవంతం అయ్యారని, పవన్ కల్యాణ్‌.. ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారో తెలుసునని, వేరే అభ్యర్ధులను పెట్టి పోలిన గుర్తులు కేటాయించడం వల్ల కూటమి అభ్యర్ధులకు ఎలాంటినష్టం లేదన్నారు. టీడీపీ పార్టీ ప్రారంభం లో అందరికీ సైకిల్ గుర్తు ఎన్నికల సంఘం ఇచ్చిందని, అప్పట్లో ఇతరులకు ఈ గుర్తులను కేటాయించలేదని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్‌ ను అడ్డుకునేందుకు కుట్రలు చేయడం దారుణమన్న ఆయన.. పవన్ తన సొంత నిధులు రైతులకు సాయం చేశారని, అనేక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంటే, జగన్ సొంత నిధులేమైనా ఖర్చు చేశాడా? అని గోరంట్ల ప్రశ్నించారు. యువతకు స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలు లేకుండా చేశారని విమర్శించారు. కాపు ఉద్యమ నేతగా చెప్పుకుంటున్న ముద్రగడ పద్మనాభం.. కాపులకు తీరని అన్యాయం చేశారని, పిఠాపురంలో ముద్రగడ పద్మనాభమే పోటీ చేసివుంటే అసలు సంగతి ఏమిటో తేలేది కదా అని కౌంటర్‌ ఇచ్చారు. చంద్రబాబు ఈడబ్యూఎస్ లో ఐదు శాతం రిజర్వేషన్లను కాపులకు ఇస్తే.. వాటిని రద్దు చేసిన సీఎం జగన్ కు పద్మనాభం మద్దతు ఇస్తూ.. కాపులకు అన్యాయం చేశారని గోరంట్ల బుచ్చియ్యచౌదరి మండిడ్డారు.