NTV Telugu Site icon

Trump-Yunus: ట్రంప్ రాకతో బంగ్లాదేశ్‌లో హిందువులకు మంచి రోజులు?

Trump Yunus

Trump Yunus

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యారు. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్‌పై ఆయన విజయం సాధించారు. 2016 నుంచి 2020 వరకు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన ట్రంప్.. అధ్యక్షుడిగా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం ఒక్క అమెరికాకే పరిమితం కాకుండా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్శించింది. డొనాల్డ్ ట్రంప్ విజయం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్‌కు అంత మంచిది కాదని భావిస్తున్నారు. అలాగే, బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న హిందువులు కూడా ట్రంప్ విజయంతో ప్రయోజనం పొందవచ్చని వార్తలొస్తున్నాయి.

ఓటింగ్‌కు కొన్ని రోజుల ముందు ట్రంప్ ఆవేదన..
ఓటింగ్‌కు కొన్ని రోజుల ముందు, డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో నివసిస్తున్న పెద్ద సంఖ్యలో హిందువులను ఆకర్షించడానికి బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రైస్తవులతో పాటు ఇతర మైనారిటీలపై జరిగిన అనాగరిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. అల్లరి మూకలు హిందువుల ఇళ్లు, దుకాణాలను దోపిడీ చేశారు. దీంతో ఆ దేశంలో తీవ్రమైన భయానక గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. నా సమయంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను కమలా, బైడెన్‌లు విస్మరించారు. ఇజ్రాయెల్‌ నుంచి మొదలుకొని, ఉక్రెయిన్‌, అమెరికా దక్షిణ సరిహద్దు వరకు విపత్తులు ఎన్నో ఉన్నాయి. మేం అధికారంలోకి వస్తే మళ్లీ అమెరికాను బలంగా తయారు చేసి శాంతిని నెలకొల్పుతాం. రాడికల్‌ లెఫ్ట్‌ నుంచి ఎదురవుతున్న మత వ్యతిరేక ఎజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తాం. హిందువుల స్వేచ్ఛ కోసం పోరాడతాం. నా పరిపాలనతో ఇండియాతో పాటు నా స్నేహితుడు, ప్రధాని మోడీతో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంటాం. కమలా హారిస్‌ గెలిస్తే అధిక పన్నులు, కఠినమైన నిబంధనలతో మీ చిన్న వ్యాపారాలను దెబ్బతీస్తుంది. నేను గెలిస్తే పన్నులు, నిబంధనల్లో కొత విధిస్తా. అమెరికాను చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిర్మిస్తా. ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా అమెరికాను అత్యంత శక్తిమంతగా, ఉత్తమంగా తీర్చిదిద్దుతా. అమెరికాను మరోసారి ఉన్నతస్థాయిలో నిలబెడతా. దీపావళి పండగ చెడుపై విజయం సాధించేలా చేస్తుందని నమ్ముతున్నాను’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

బైడెన్‌తో యూనస్‌కు మంచి సంబంధాలు….
బైడెన్‌తో యూనస్‌కు మంచి సంబంధాలు ఈ ఏడాది ఆగస్టు ప్రారంభంలో, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రిజర్వేషన్ సమస్యపై ప్రజల నిరసనల కారణంగా దేశం విడిచి భారతదేశానికి రావాల్సి వచ్చింది. దీని తరువాత నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ పర్యవేక్షణలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. యూనస్ పాశ్చాత్య దేశాలకు, ముఖ్యంగా అమెరికాకు తొత్తుగా పరిగణించబడ్డారు. అమెరికాలో కూడా ఆయన జో బిడెన్, కమలా హారిస్ మొదలైన పేర్లతో సహా డెమోక్రటిక్ నాయకులతో సన్నిహితంగా ఉన్నారు. తన తొలగింపునకు అమెరికాను నిందించిన షేక్ హసీనా ప్రకటన కూడా దీనిని ధృవీకరించింది. అమెరికా తన నుంచి సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని కోరుకుందని హసీనా చెప్పారు. ఆమె దానిని తిరస్కరించారు. ఆ తర్వాత తన ప్రభుత్వం పడగొట్టడంలో అమెరికా హస్తం ఉందని ఆమె ఆరోపించారు. మొహమ్మద్ యూనస్ కొంతకాలం క్రితం అమెరికా సందర్శించినప్పుడు.. ఆయన డొనాల్డ్ ట్రంప్‌తో సహా ఏ రిపబ్లికన్ నాయకుడిని కలవలేదు. ఇది ఇద్దరి మధ్య సంబంధాన్ని వెల్లడిస్తుంది. ఆ పర్యటనలో బైడెన్, యూనస్ కలుసుకోవడమే కాకుండా లోతైన చర్చలు కూడా జరిపారు. బంగ్లాదేశ్‌కు అమెరికా పూర్తి మద్దతు గురించి కూడా మాట్లాడింది.

మహ్మద్ యూనస్, ట్రంప్ మధ్య సంబంధాలు ?
2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ బంపర్ విజయం సాధించారు. దీని తరువాత, ఆయన వాషింగ్టన్‌లో బంగ్లాదేశ్ ప్రతినిధి బృందాన్ని కలిసినప్పుడు.. తన పేరు తీసుకోకుండా యూనస్‌పై విరుచుకుపడ్డారు. డొనాల్డ్ ట్రంప్ ప్రసంగంతో ప్రతినిధులను ఆశ్చర్యపరిచారు. ప్రతినిధులకు తన అధికారిక పరిచయం తర్వాత, డోనాల్డ్ ట్రంప్, “ఢాకా నుంచి మైక్రో ఫైనాన్స్ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు?” నేను ఓడిపోయానని చూసేందుకు విరాళం ఇచ్చాడని విన్నాను అని ట్రంప్ అన్నారు.” బంగ్లాదేశ్‌లోని మైక్రో ఫైనాన్స్ స్పెషలిస్ట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్యాంక్ అయిన గ్రామీణ్ బ్యాంక్ ఛైర్మన్‌గా ఉన్న మహ్మద్ యూనస్ గురించి ట్రంప్ ప్రస్తావించారు. తన హయాంలో బంగ్లాదేశ్‌, అమెరికా మధ్య సంబంధాలు జో బైడెన్‌, యూనస్‌ల కాలంలో ఉన్నంత మెరుగ్గా ఉండవని ట్రంప్‌ ప్రకటన ద్వారా స్పష్టం చేశారు.

హిందువుల కోసం ట్రంప్‌ కృషి చేయాలి?
బంగ్లాదేశ్‌లో అధికారం మారిన తర్వాత హిందువులపై హింస మొదలైంది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో దేవాలయాలు కూడా లక్ష్యంగా చేసుకున్నారు. అనేక ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న హిందువులు రాజీనామాలు కూడా చేయవలసి వచ్చింది. ఓటింగ్‌కు ముందు, బంగ్లాదేశ్‌లో హిందువులపై అణచివేత అంశాన్ని లేవనెత్తడం ద్వారా ట్రంప్ తన ఉద్దేశాలను స్పష్టం చేశారు. బైడెన్, హారిస్ అధికారంలో ఉన్నప్పుడు హిందువులను రక్షించడానికి బంగ్లాదేశ్‌పై ఒత్తిడి తెచ్చిన విధంగా కాకుండా.. యూనస్ దేశంలో ఇది జరగడానికి వారు అనుమతించరని పలు ప్రకటన ద్వారా స్పష్టమైంది. ఇప్పుడు ట్రంప్ అమెరికా తదుపరి అధ్యక్షుడిగా మారబోతున్నందున, బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న హింసకు సంబంధించి యూనస్‌పై ఒత్తిడి తీసుకురావాలి. ఆయన చెప్పిన మాటలను వాస్తవంగా మార్చాలి.

Show comments