Gold Rates: మరో సారి భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలు ఇవే..

Gold Rates Today

Gold Rates Today

పసిడి ప్రియులకు ఊరటనిస్తూ బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన పసిడి ధరల్లో ఒక్కసారిగా క్షీణత కనిపిస్తుండటంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, డాలర్ బలోపేతం కావడం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు భారీగా పడిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధరపై రూ.1,900 తగ్గడంతో, ప్రస్తుతం రూ.1,42,480 వద్ద పలికింది. అదే విధంగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,750 తగ్గి, రూ.1,30,600 వద్దకు చేరింది. మరోవైపు.. కిలో వెండి ధర రూ.2,25,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ తదితర ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,600 స్థాయికి దిగిరావడం విశేషం. పసిడి రేట్లు వరుసగా తగ్గుతూ రావడం వల్ల ఆభరణాల కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశంగా మారుతోంది. గత కొన్ని నెలలుగా ఆల్-టైమ్ గరిష్ట స్థాయిలను తాకుతూ వచ్చిన పసిడి ధరలు, ఈ ధరలకు చేరుకోవడం గమనార్హం. పండుగల సీజన్ , పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ ధరల్లో ఈ తగ్గుదల ధోరణి వినియోగదారులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం.. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ సూచీల్లో మార్పులను బట్టి బంగారం ధరల ట్రెండ్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి తగ్గతున్న ఈ ధరలతో షాపింగ్ చేసేందుకు పసిడి ప్రియులు ఆసక్తి చూపుతున్నారు.