దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరాయి. పెట్టుబడిదారులు, వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేసేలా ధరల్లో భారీ పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా బంగారం ధర తులంపై ఏకంగా రూ.11,770 పెరగడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గురువారం (జనవరి 29) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,78,850కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.10,800 పెరిగి.. రూ.1,63,950గా నమోదైంది.
హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,78,850గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,63,950గా కొనసాగుతున్నాయి. ఇంత భారీ ధరలు గతంలో ఎన్నడూ లేవని వ్యాపారులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ ఈ ధరలు వినియోగదారులకు భారంగా మారాయి. ఇక వెండి ధర బంగారం కంటే భారీగా పరుగెడుతోంది. ఒక్క రోజులోనే కిలోపై రూ.30,000 పెరిగింది. బులియన్ మార్కెట్లో ఈరోజు కిలో వెండి ధర రూ.4,10,000కు చేరింది. హైదరాబాద్ నగరంలో నేడు కిలో వెండి ధర రూ.4,25,000గా నమోదైంది. వెండి ధరలు ఇంత స్థాయిలో పెరగడం చాలా అరుదైన విషయమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Suryakumar Yadav: మమ్మల్ని మేమే పరీక్షించుకున్నాం.. మా ప్రణాళిక బెడిసికొట్టింది!
అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి, డాలర్ మారకం విలువలో మార్పులు, జియోపాలిటికల్ టెన్షన్లు, సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా బంగారం వైపు పెట్టుబడిదారుల మొగ్గు పెరగడం వల్లే ఈ ధరల పెరుగుదల చోటుచేసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరడంతో సామాన్యులకు కొనుగోలు భారంగా మారింది. మరోవైపు పెట్టుబడిదారులకు మాత్రం ఇది లాభదాయక పరిస్థితిగా మారింది. రానున్న రోజుల్లో ధరలు ఇంకా పెరుగుతాయని సమాచారం.