NTV Telugu Site icon

Godavari Water Level: 39 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం.. రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక!

Bhadrachalam Water Level

Bhadrachalam Water Level

First Danger Warning Soon at Bhadrachalam: భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గురువారం 20 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం.. ఆదివారం ఉదయానికి 39 అడుగులకు చేరుకుంది. తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రస్తుతం వరద పోటెత్తుతోంది. భద్రాచలం ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రాత్రికి ఇది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి రావచ్చని ఇప్పటికే అధికార యంత్రాంగానికి సీడబ్ల్యుసీ హెచ్చరికలు జారీ చేసింది. నీటిమట్టం 43 అడుగులు దాటితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.

కాలేశ్వరం, తుపాకుల గూడెం నుంచి భారీ వరద వస్తుంది. శనివారం ఉదయం తుపాకుల గూడెం నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల వరద దిగివకి వదలగా..ఈరోజు అది ఎనిమిది లక్షలకు పైచిలుకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలం దిగువన ఆంధ్ర ప్రాంతంలో ఉన్న శబరి నది 38 అడుగులు మేర ప్రవహిస్తోంది. దాంతో అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. చింతూరు వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఇప్పటికే జారీ చేసే పరిస్థితి ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వర్షాలతో కూడా భారీ వరద వచ్చి గోదావరిలో చేరుతోంది. ఇప్పటివరకు పోలవరం ,ధవలేశ్వరం వద్ద వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకి వదులుతున్నారు. దీంతో గోదావరి నుంచి సముద్రం వైపుకి భారీగా వరద తరలివెళ్తుంది.

Also Read: Warangal Bhadrakali Temple: శాకంబరీ అలంకరణలో భద్రకాళీ అమ్మవారు.. ఆలయానికి పోటెత్తిన భక్తులు!

నిర్మల్‌ జిల్లాలోని కడెం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఇన్‌ఫ్లో 19,686గా.. ఔట్‌ఫ్లో 18,227 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 690.875 అడుగులు ఉంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లోకి 385 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1387 అడుగులుగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 4.06 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో 85 గేట్లు ఎత్తి వరదను కిందికి వదులుతున్నారు.

Show comments