NTV Telugu Site icon

Godavari-Sabari: గోదావరి-శబరి నదుల ఉగ్రరూపం.. విలీన మండలాల్లో టెన్షన్‌ టెన్షన్..

Koonavaram

Koonavaram

Godavari-Sabari: కూనవరం సంగమం వద్ద గోదావరి- శబరి నదులు ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నాయి. కూనవరం మండలం టేకులబోరు వద్ద ఉదయ భాస్కర్ కాలనీ నీట మునిగడంతో కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. కూనవరం పోలీస్ స్టేషన్‌ను వరదనీరు చుట్టుముట్టింది. కూనవరం మండలం పంద్రాజుపల్లి వద్ద ప్రధాన రహదారిపైన, కొండ రాజుపేట కాజువే పైన వరద నీరు ప్రవహిస్తోంది. వరద అంతకంతకూ పెరుగుతుండటంతో, ట్రాక్టర్లు,ఆటోలలో సామాన్లు సర్దుకుని ఇళ్లు ఖాళీ చేసి ప్రజలు వెళ్లిపోతున్నారు. కూనవరం మండలం పంద్రాజుపల్లి గ్రామం వద్ద రోడ్డుకి ఇరువైపులా వెదురు గుడారాలు వెలిశాయి. శబరి కొత్తగూడెం, కొండరాజు పేట గ్రామాలు వరద ముంపుకు గురవడంతో గిరిజనులు ఊరు ఖాళీ చేశారు. ఎత్తైన ప్రాంతాల వద్ద వెదురు కలపతో తయారుచేసుకున్న గుడారాలపై టారబాన్లు కప్పుకుని నివాసం ఉంటున్నారు. సుమారు 300 కుటుంబాలు తరలి వెళ్లాయి. ప్రతి సంవత్సరం ఇవే బాధలు పడుతున్నామని, పోలవరం పరిహారం ఇప్పిస్తే గిరిజనులు వెళ్లిపోతామంటున్నారు.

Read Also: Srisailam Project: శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద.. రెండు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం..

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలతో విలీన మండలాల్లోని ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఒక పక్క శబరి, మరోపక్క గోదావరి నదుల ఇక్కడి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇటు నదులు, అటు వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఎటు చూసినా వరద నీరు తప్ప వారికేమి కనపడట్లేదు. మొత్తంగా విలీన మండలాల్లోని ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఎడతెరిపి లేని వర్షాలతో అసలు ఏమౌతోందో తెలుసుకునే లోపే రాత్రికి రాత్రే వరద రూపంలో ఇళ్ల చుట్టూ నీరు చేరడం, అక్కడ్నుంచి ఎటైనా వెళ్దామంటే రోడ్లు కూడా వరద నీటితో మూసుకుపోవడం, వెరసి ఆలోచించుకునే సమయం కూడా వీరికివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి వరదలు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఇంట్లో చేతికందిన తట్ట బుట్ట సర్దుకుని, ఇళ్లను నీటికొదిలేసి ఎత్తైన ప్రాంతాలకు తరలిపోయి తలదాచుకుంటున్నారు. తాజాగా కూనవరం, టేకులబోరు గ్రామాల్లోకి వరద నీరు రావడంతో వీరంతా నీటిలోనే ట్రాక్టర్ల సహాయంతో కోతులగుట్ట వరద సహాయక కేంద్రాలకు తరలివెళ్లారు. అక్కడున్న హాస్టల్స్, సచివాలయం భవనాల్లో తలదాచుకుంటున్నారు. ఎక్కడికక్కడే సామాన్లు పడేసి, వర్షంలో తడుస్తూ జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. అడపా దడపా ఇచ్చే కూరగాయలు, ఉప్పు, పప్పు, బియ్యం వారికెటు సరిపోక అటు ఉండలేక ఇటు వెళ్లలేక లబోదిబోమంటున్నారు.

Read Also: Bhadrachalam: గోదావరికి వరదలు.. గోదావరిలోకి భక్తులను అనుమతించని పోలీసులు..

మరో పక్క కూనవరం మండలంలోని కొండ్రాజుపేట,శబరి కొత్తగూడెం గ్రామాల్లోని గిరిజనుల కష్టాలు మరోలా ఉన్నాయి. ఈ రెండు గ్రామాలను వరద పూర్తిస్థాయిలో ముంచేస్తుంది. దీంతో సుమారు 300 కుటుంబాలు ప్రతి ఏటా ఊర్లు ఖాళీ చేసి పంద్రాజుపల్లి వద్ద రోడ్డు పక్కన గోదావరి పట్టని ప్రాంతానికి చేరుకున్నారు. దగ్గర్లోని అటవీ ప్రాంతం నుంచి వెదురు బొంగులు తెచ్చుకుని, వాటితో గుడారాలు నిర్మించుకున్నారు వాటిలో వర్షం కురవకుండా టార్పాలిన్లు కప్పుకుని, వాటిలో కుటుంబమంతా నివాసముంటున్నారు. ఈ క్రమంలో తిండి, నీరు ఉన్నా రాత్రి వేళల్లో కరెంటు లేకపోవడంతో పాములు, తేళ్లు కూడతాయేమో అని నిద్ర మానేసి బిక్కు బిక్కుమంటూ మెలకువతోనే గడిపేస్తున్నారు. వృద్దులు, చిన్న పిల్లలు, బాలింతలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు.

Read Also: Tirumala: ఆగస్టులో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు ఇవే..

గత కొన్ని సంవత్సరాలుగా కష్టపడి సంపాదించడం, సంపాదించిన ఆస్తులు అన్నీ వరద పాలవ్వడంతో లబోదిబోమనడం వీరందరికి అలవాటుగా మారిపోయింది. కొన్ని దశాబ్దాలుగా వీరి బ్రతుకుల్లో మార్పు రాకపోగా రోజు రోజుకీ మరింత దయనీయంగా మారుతున్నాయి. నిత్యం వాహనాలు తిరిగే రోడ్లన్నీ నీటిలో మునిగిపోగా, మర పడవలపై ప్రయాణిస్తూ నీటిలో నానుతున్న తమ ఇళ్ళని చూసి కన్నీటి పర్యంతమవ్వడం వీరికి పరిపాటిగా మారిపోయింది. అసలు దీనంతటికి ప్రధాన కారణం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అని, ఇది ప్రారంభించాక బ్యాక్ వాటర్ ప్రభావంతో ప్రతి సంవత్సరం జులై, ఆగస్టు, సెప్టెంబర్ మూడు నెలలపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు న్యాయంగా రావాల్సిన పోలవరం పరిహారం ఇప్పిస్తే ఊరొదిలి వెళ్లిపోతామని విలీన మండలాల ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.