Site icon NTV Telugu

Uttar Pradesh: బాలికపై స్కూల్‌ టీచర్‌ అత్యాచారం.. చికిత్స పొందుతూ మృతి

Uttar Pradesh

Uttar Pradesh

Uttar Pradesh: కోల్‌కతాలో మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో 14 ఏళ్ల బాలిక ఉపాధ్యాయుడిచే అత్యాచారానికి గురై మరణించింది. 14 ఏళ్ల బాధితురాలు, సోన్‌భద్ర జిల్లాలోని దుద్ది గ్రామంలోని నివాసి, వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్శిటీ ఆసుపత్రిలో 20 రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి మరణించింది. నిందితుడు విశాంబర్‌ ఇంకా పరారీలో ఉన్నాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు పాఠశాలలో స్పోర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నాడని, గతేడాది డిసెంబర్ 30న ఓ స్పోర్ట్స్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆమెను పిలిచాడని తెలిపారు. అనంతరం ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అవమానానికి భయపడి బాధితురాలు ఏమీ చేయలేదని, ఘటన తర్వాత ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెను బంధువుల వద్దకు వెళ్లేందుకు ఛత్తీస్‌గఢ్‌కు పంపగా, అక్కడ ఆమెకు చికిత్స అందించినప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితి అలాగే ఉంది. దీంతో బాధితురాలు మౌనం వీడి జరిగిన విషయాన్ని అత్తకు చెప్పగా.. ఆమె ఆస్పత్రిలో చేర్చింది.

Read Also: Kolkata Doctor Case: ‘దేశం ఆత్మపై దాడి’.. సీజేఐ వద్దకు చేరిన కోల్‌కతా మహిళా డాక్టర్ హత్య కేసు

పరువు పోతుందని భయపడి ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేయలేదని కుటుంబీకులు తెలిపారు. అయితే బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె తండ్రి జులై 10న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాకు చెందిన విశాంబర్‌పై కేసు నమోదు చేశారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని సీనియర్ పోలీసు అధికారి మంగళవారం తెలిపారు. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న సమయంలో మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేయడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Exit mobile version