Site icon NTV Telugu

GHMC: జీహెచ్ఎంసీ విభజనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. మూడు కార్పొరేషన్లు విభజిస్తూ జీవో రిలీజ్..

Ghmc

Ghmc

GHMC: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత జీహెచ్ఎంసీ పరిధిలోని కోర్ అర్బన్ ఏరియాను పునర్విభజించి మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ యథావిధిగా కొనసాగనుండగా, కొత్తగా సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌లను ఏర్పాటు చేశారు. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లను కలిపి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా రూపొందించారు. ఐటీ, అభివృద్ధి చెందిన పట్టణ ప్రాంతాల పరిపాలనను మరింత సమగ్రంగా నిర్వహించేందుకు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.

READ MORE: India vs Pakistan: పాకిస్థాన్ బలుపు మాటలు.. భారత్‌తో మ్యాచ్‌కు ఆసిమ్‌ మునీర్‌కి సంబంధం ఏంటి?

అలాగే ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజిగిరి జోన్లను కలిపి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేశారు. వేగంగా విస్తరిస్తున్న నివాస ప్రాంతాలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోల్కొండ, చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లతో జీహెచ్ఎంసీ కొనసాగనుంది. ఈ మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించి కొత్త పాలక మండళ్లు బాధ్యతలు చేపట్టే వరకు ప్రత్యేక అధికారిగా జయేష్ రంజన్‌ను ప్రభుత్వం నియమించింది. జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌ల పరిపాలన బాధ్యతలను ఆయన ప్రత్యేక అధికారిగా నిర్వహించనున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు అన్ని పరిపాలనా వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు. నగర విస్తరణ, జనాభా పెరుగుదల మరియు పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నగర అభివృద్ధికి దోహదపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

READ MORE: Team India: పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు భారత్‌కు బిగ్‌ షాక్.. ఆసుపత్రిలో చేరిన విధ్వంసకర బ్యాట్స్ మెన్

Exit mobile version