తెలంగాణ వ్యాప్తంగా గత రెండు వారాలుగా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో సైతం భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అయితే.. ఉరుములు, ఈదురు గాలులతో కూడి భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. కొన్ని చోట్ల రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా.. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ఆ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సెల్లార్ తవ్వకాలపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు నిర్మాణదారులకు పలు సూచనలు జారీ చేస్తూనే సెల్లార్ నిర్మాణాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది జీహెచ్‌ఎంసీ. అన్ని సర్కిళ్ల ఏసీపీలు, డీసీలు తగు చర్యలు చేపట్టాలని లేదంటే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ హెచ్చరికలు జారీ చేశారు. నిర్మాణాలు చేపట్టే ప్రతి బిల్డర్ రక్షణ చర్యలు చేపట్టాలని, రక్షణ గోడ నిర్మాణం, పని జరుగుతున్న ప్రదేశం చుట్టూ బారికేడింగ్, సెల్లార్‌లో నీరు నిలువకుండా చూసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సెల్లార్, సెట్‌బ్యాక్‌లను అధికారులు తనిఖీ చేయాలన్నారు.
Also Read : Vijayawada Crime: బెజవాడలో దారుణం.. రూ.100 ఇవ్వలేదని కత్తితో దాడి
రక్షణ చర్యలు చేపట్టని సదరు నిర్మాణ దారుడి అనుమతి రద్దుతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అప్పటి వరకు తవ్విన సెల్లార్ గుంతలను నిర్మాణ వ్యర్థాలతో నింపేయడం తగదని సూచించారు. ప్రమాదకర సెలార్ల పక్కన, వరద తీవ్రతకు గురయ్యే జనావాసాలను సంబంధిత డీసీలు పర్యవేక్షణలో పోలీసుల సాయంతో ఖాళీ చేయించాలని కమిషనర్ పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా సెల్లార్ల పక్కన కార్మికులకు షెడ్లు నిర్మించడం, ఇతర నిబంధనలను ఉల్లంఘనలు, కార్మికుల అడ్డాల పరిశీలనపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి సంబం ధిత బిల్డర్లపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. జోనల్ కమిషనర్లు, ప్లానింగ్ ఆఫీసర్లు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కమిషనర్ చెప్పారు. వర్షాకాలం మొదలైన రోజు నుంచి పూర్తయ్యే వరకు సెల్లార్ తవ్వకంపై నిషేధం ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు కమిషనర్.
Also Read : Gangster Murdered in Tihar Jail: తీహార్ జైల్లో గ్యాంగ్ వార్.. గ్యాంగ్‌స్టర్ మృతి
