NTV Telugu Site icon

Farmer : అధికారుల ముందే ప్రాణాలను తీసుకున్న అన్నదాత

New Project (14)

New Project (14)

Farmer : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అందరికీ అన్నం పెట్టే అన్నదాత అధికారుల ముందే ఆత్మార్పణ చేసుకోవడం పలువురిని కంట తడి పెట్టించింది. తన భూమి ఆక్రమణకు గురైందని ఓ రైతు ఎంత వేడుకున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీంతో విసిగి వేసారిన ఆ రైతు ఉన్నతాధికారుల ముందే చేతి మణికట్టు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భూమిని వేరే వ్యక్తులు ఆక్రమించుకోవడంతో రైతు చాలా కాలంగా ఆందోళన చెందుతున్నాడు. పలుమార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. రైతు చేతి నరము కోసుకున్నాడు. రక్తంతో తనతో తెచ్చిన ఫిర్యాదు లేఖ తడిసిపోయింది. రైతును ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Read Also: Mla Sanjay Kumar : అవును మేం ఓట్ల బిచ్చగాళ్లమే..

డిడోలి గ్రామానికి చెందిన 65 ఏండ్ల సుశీల్‌ త్యాగీ బతుకుదెరువు కోసం వచ్చి ఇంద్రపురి కాలనీలో నివసిస్తున్నాడు. గ్రామంలో కొంతమంది సుశీల్‌ భూమిని ఆక్రమించారు. ఈ విషయంపై ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదు. రక్తంతో రాసిన లేఖను రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు పంపాడు. శనివారం ‘సంపూరన్‌ సమాధాన్‌ దివస్‌’ను పురస్కరించుకొని ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమోనని వెళ్లిన సుశీల్‌ ఉన్నతాధికారుల ముందు గోడు వెళ్లబోసుకున్నాడు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అడిషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌, సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ సమక్షంలో సుశీల్‌ త్యాగీ హఠాత్తుగా తన చేయి కోసుకొన్నాడు. మీరట్‌ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే సుశీల్‌ త్యాగీ చనిపోయాడు.

Read Also: Uddhav Thackeray : ఔను అధికారం కోసమే కలిశాం..

పోస్టుమార్టం నివేదిక తర్వాత రైతు మృతికి గల కారణాలు తెలుస్తాయని అదనపు జిల్లా మెజిస్ట్రేట్ (ఏడీఎం) రీతూ సుహాస్ తెలిపారు. త్యాగి తన స్వగ్రామం డిడోలి నుంచి ముజఫర్‌నగర్ జిల్లాలోని ఇంద్రపురి కాలనీకి మారాడని, ఆయన లేకపోవడంతో ఆయన భూమి కబ్జాకు గురైందన్నారు. దాని కోసమే తిరుగుతున్నాడని రైతు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

జిల్లా మేజిస్ట్రేట్ ఆర్కే సింగ్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ తన భూమిని రెండుసార్లు కొలిచేందుకు ప్రయత్నించిందని, అయితే గ్రామంలో ఇళ్ల నిర్మాణం కారణంగా భూమి జాడ తెలియలేదని చెప్పారు. ఈ వ్యవహారంలో విచారణను ఏడీఎం అడ్మినిస్ట్రేషన్‌ రీతూ సుహాస్‌కు అప్పగించినట్లు తెలిపారు. ఆయన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని సింగ్ చెప్పారు.