Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..

Vibhav Gambir

Vibhav Gambir

Gautam Gambhir: క్రికెట్ ప్రపంచంలో గత కొన్ని నెలల నుంచి ఓ కుర్రాడి పేరు మార్మోగుతోంది. టీమిండియాకు సంబంధించి ఎక్కడ ఏ మ్యాచ్ జరిగినా ఆ యువకుడి పేరు వినిపిస్తుంది. ఆ యువ కెరటం మరెవరో కాదు.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. చిన్న వయసులోనే టీ20 క్రికెట్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో హోరెత్తించిన ఈ యువ సంచలనంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ, టీమిండియా టీ20 ఇంటర్నేషనల్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి అతడు ప్రవేశించడం ప్రస్తుతం అనుకున్నంత సులభం కాదని స్పష్టమవుతోంది. వైభవ్ అపారమైన ప్రతిభావంతుడని, సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడని అంగీకరించిన భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, అతనికి సరైన సమయం వచ్చే వరకు వేచి చూడక తప్పదని తేల్చి చెప్పారు.

వెస్టిండీస్‌తో జరగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు జియోస్టార్ నిర్వహించిన ‘ఫాలో ది బ్లూస్: గౌతమ్ గంభీర్ అన్‌ఫిల్టర్డ్’ కార్యక్రమంలో గంభీర్ ఈ విషయాలపై మనసు విప్పి మాట్లాడారు. వైభవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ రావడం సహజమేనని, కానీ కేవలం సోషల్ మీడియా రచ్చను బట్టి లేదా ఒకరి ప్రస్తుత ఫామ్‌ను చూసి ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేయలేమని స్పష్టం చేశారు. వైభవ్‌కు ఉన్న టాలెంట్‌పై గౌరవం ఉన్నప్పటికీ, జట్టులో సుదీర్ఘకాలంగా స్థిరంగా రాణిస్తున్న సీనియర్లు ఉన్నప్పుడు వారికి ఇచ్చే ప్రాధాన్యతే ము ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లకు భద్రతా భావాన్ని అందించడం చాలా కీలకమని గంభీర్ అభిప్రాయపడ్డారు. జట్టు కోసం ఎంతో కాలంగా మంచి ప్రదర్శన చేస్తున్న ఒక ఆటగాడు, ఏవైనా మూడు నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడని వెంటనే పక్కన పెట్టేసి, ఆ స్థానంలో కొత్త యువ ఆటగాడిని తీసుకురావడం సరైన పద్ధతి కాదన్నారు. ఒకవేళ ఇప్పుడు వైభవ్‌కు అవకాశం ఇవ్వాలంటే, గత ఏడాదిన్నర-రెండేళ్లుగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సంజూ శాంసన్ లేదా అభిషేక్ శర్మలలో ఒకరిపై వేటు వేయాల్సి ఉంటుందని, అలా చేయడం ఏమాత్రం న్యాయం కాదని చెప్పారు.

బయట వినిపించే వార్తలు లేదా సోషల్ మీడియా హడావుడి జట్టు ఎంపికను ప్రభావితం చేయబోవని గంభీర్ తేల్చి చెప్పారు. కోచ్, కెప్టెన్ల ఆలోచనల ప్రకారం జట్టు గెలవడానికి ఏ కాంబినేషన్ అయితే సరైనదో దానికే ప్రాధాన్యత ఇస్తామన్నారు. వైభవ్ పాపులారిటీ, అతని వయస్సు లేదా ఇటీవలి మెరుపు ప్రదర్శనల కంటే మ్యాచ్ గెలిపించే జట్టు కూర్పు, పాత ఆటగాళ్ల రికార్డులే ప్రధానమని స్పష్టం చేశారు. టీమ్‌లో స్థిరత్వం ఉండాలని, ఒకసారి వరల్డ్ కప్ గెలిచినంత మాత్రాన ప్రతి సిరీస్‌లోనూ ఓటమి లేకుండా గెలవడం కుదరదని, ఒక్క సిరీస్ లేదా కొన్ని మ్యాచ్‌లలో ఫెయిల్ అయినంత మాత్రాన ఎవరూ రాత్రికి రాత్రే చెడ్డ ఆటగాళ్లు అయిపోరని సంజూ, అభిషేక్‌లకు మద్దతుగా నిలిచారు.

జట్టు హితం కోసం కొన్నిసార్లు జనాదరణ లేని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని గంభీర్ తెలిపారు. వైభవ్ విషయంలో మేనేజ్‌మెంట్‌కు ఎలాంటి సందేహాలు లేవని, అతడి ప్రతిభను ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారని చెప్పారు. అయితే జట్టులో చోటు లభించాలంటే కేవలం టాలెంట్, ఫామ్ ఉంటే సరిపోదని, జట్టు అవసరాలు, ఆటగాళ్ల స్థిరత్వమే ప్రామాణికమని స్పష్టం చేశారు. ప్రస్తుతం వైభవ్‌కు జట్టు మేనేజ్‌మెంట్ ఇస్తున్న సందేశం ఒక్కటే.. సరైన అవకాశం వచ్చేవరకు ఓపికగా ఎదురుచూడటం, ఆ అవకాశం వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా వినియోగించుకోవడం.