Site icon NTV Telugu

Gannavaram Tragedy: ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం.. గన్నవరంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి!

Gannavaram Tragedy

Gannavaram Tragedy

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఓ కానిస్టేబుల్ బైక్ వెంటపడి హ్యాండిల్ పట్టుకుని లాగడంతో.. విద్యార్థి ఎదురుగా వసున్న బొలెరో వ్యాన్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి…

గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన పలగాని ప్రణయ్ ‘కేఎల్ యూనివర్సిటీ’లో ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అతని తమ్ముడు కౌషిక్ విజయవాడలోని ఎంఎంఎం కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ప్రతిరోజూ కౌషిక్‌ను తండ్రి శివాజీ ట్యూషన్ కోసం అవుటపల్లి తీసుకెళ్లేవాడు. అయితే శనివారం తండ్రి అందుబాటులో లేకపోవడంతో.. ప్రణయ్ తన తమ్ముడు కౌషిక్‌ను బైక్‌పై అవుటపల్లి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అన్నదమ్ములు వెళ్తున్న బైక్‌ను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక కానిస్టేబుల్ బైక్ వెంటపడి హ్యాండిల్ పట్టుకుని లాగాడు.

Also Read: Shikhar Dhawan: ఎంఎస్ ధోనీ ఎంతో మంది క్రికెటర్ల కెరీర్‌లను తీర్చిదిద్దాడు.. కష్టకాలంలో అండగా ఉంటాడు!

కానిస్టేబుల్ హ్యాండిల్ పట్టుకోవడంతో ప్రణయ్ భయంతో బైక్‌ను వెనక్కి తిప్పే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న బొలెరో వ్యాన్‌ను బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో ప్రణయ్‌కు తీవ్ర గాయాలు కాగా.. అతని తమ్ముడు కౌషిక్ కూడా గాయపడ్డాడు. ఇద్దరినీ వెంటనే సమీపంలోని పిన్నమనేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రణయ్ మృతి చెందాడు. తమ్ముడు కౌషిక్‌కు చికిత్స కొనసాగుతోంది. కొడుకు మృతి చెందడం, మరో కొడుకు గాయపడటంతో శివాజీ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రణయ్ మృతదేహాన్ని గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. బంధువులు, తోటి విద్యార్థులు అక్కడికి చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version