Gangamma Lockup Death Case: గంగమ్మ లాకప్ డెత్ కేసు.. హైకోర్టు కీలక ప్రశ్నలు

Gangamma Lockup Death Case

Gangamma Lockup Death Case

Gangamma Lockup Death Case: దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్ ఘటనపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా దుర్గప్పకు అందించిన వైద్య చికిత్సకు సంబంధించిన అన్ని నివేదికలను ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ సీల్డ్ కవర్‌లో ధర్మాసనానికి సమర్పించారు. కోర్టు ఆ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది పలు కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. గంగమ్మ కుమార్తె లక్ష్మిని పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఆమె స్వగ్రామానికి ఇతరులను వెళ్లనివ్వడం లేదని ఆరోపించారు. అలాగే గంగమ్మ మృతదేహానికి రీ-పోస్ట్‌మార్టం నిర్వహించాలని కోర్టును కోరారు.

గంగమ్మ మరణానికి గల కారణాలపై ధర్మాసనం ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. పోస్టుమార్టం నివేదికలో గంగమ్మ ఎలా మరణించిందని పేర్కొన్నారో వివరాలు కోరింది. గంగమ్మ శరీరంపై గాయాలు ఉన్న విషయాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. దీనికి స్పందించిన ప్రభుత్వ న్యాయవాది, కార్డియాక్ అరెస్ట్‌తో పాటు ఇతర కారణాల వల్ల గంగమ్మ మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. అదే సమయంలో వీరేంద్ర కేసులో గంగమ్మ కుమార్తె లక్ష్మి ఎ-3 నిందితురాలిగా ఉన్నారని, అయితే ఇప్పటివరకు ఆమెను అరెస్ట్ చేయలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో లక్ష్మికి తగిన రక్షణ కల్పించాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. కేసు దర్యాప్తు, విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని అధికారులను ఆదేశించిన ధర్మాసనం, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

×
×
Ad