Site icon NTV Telugu

Delhi: శిశువులు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్.. ముగ్గురు పసికందులను కాపాడిన సీబీఐ

Cbi

Cbi

ఒకటి, రెండు రోజుల వయస్సులోపు శిశువుల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా సీబీఐ బట్టబయలు చేసింది. ఢిల్లీ, హర్యానాలో జరిపిన దాడుల్లో 1.5 రోజులు, 15 రోజులు, ఒక నెల వయసున్న ముగ్గురు శిశువులను సీబీఐ ముఠా బారి నుంచి రక్షించింది. వీరిలో ఇద్దరు మగ శిశువులు, ఒక నెల వయసున్న ఆడ శిశువు ఉన్నారు.

ఈ కేసులో నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఏడుగురు నిందితులను సీబీఐ అరెస్టు చేసింది. గత నెల రోజుల్లో 10 మంది పసికందులను ఈ ముఠా విక్రయించినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో.. ఈ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించిందని, దేశవ్యాప్తంగా పిల్లలు లేని జంటల సమాచారాన్ని సేకరించి, ఆపై వారిని వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సంప్రదించేవాడని ఇప్పటివరకు దర్యాప్తులో తేలిందని సీబీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా.. బిడ్డను దత్తత తీసుకోవాలనే కోరికను వ్యక్తం చేయడంతో సంతానం లేని దంపతులకు రూ.4 నుంచి 6 లక్షలకు విక్రయించే వారని సీబీఐ పేర్కొంది.

Viral video: స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి భూకంపం.. ప్రభావాలు చూసారా..?

మరోవైపు.. దత్తత తీసుకున్నట్లు నకిలీ పత్రాలు కూడా తయారు చేస్తున్నారు. వారు నిజమైన తల్లిదండ్రుల నుంచి శిశువులను కొనుగోలు చేసేవారని, చాలా సందర్భాల్లో అద్దె తల్లుల నుంచి కూడా పిల్లలను కొనుగోలు చేశామని నిందితులు విచారణలో సీబీఐకి తెలిపారు. ఈ కేసులో నిందితులు ఢిల్లీలోని పటేల్ నగర్‌లో ఉన్న ఓ ఐవీఎఫ్ సెంటర్‌కు, ఆస్పత్రికి అనుసంధానంగా ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.

కాగా.. నిందితుల వద్ద జరిపిన సోదాల్లో రూ. 5.5 లక్షల నగదుతోపాటు.. పలు పత్రాలు, వస్తువులను సీబీఐ స్వాధీనం చేసుకుంది. అరెస్టయిన నిందితుల్లో హర్యానాలోని సోనిపట్‌కు చెందిన నీరజ్, ఢిల్లీలోని పశ్చిమ్ విహార్‌కు చెందిన ఇందు పవార్, పటేల్ నగర్‌కు చెందిన అస్లాం, నారంగ్ కాలనీకి చెందిన పూజా కశ్యప్, మాల్వియా నగర్‌కు చెందిన అంజలి, కవితతో పాటు కేరళ వాసులు వాలి, రీతూ ఉన్నారు. నిందితులను కోర్టు నుంచి కస్టడీలోకి తీసుకుని వారి నెట్‌వర్క్‌పై సమగ్ర విచారణ జరుపుతామని సీబీఐ సీనియర్ అధికారి తెలిపారు.

Exit mobile version