Site icon NTV Telugu

Komatireddy Venkat Reddy: ప్రజాప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు రానివ్వం..

Komatireddy

Komatireddy

Komatireddy Venkat Reddy: ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం ఆర్ఆర్ఆర్‌లో భూములు కోల్పోతున్న గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 500 మంది రైతులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బంజారాహిల్స్‌లోని వారి నివాసంలో కలిశారు.

పీర్లాపల్లి, ఇటిక్యాల, లింగారెడ్డి పల్లి, ఆలీరాజ్ పేట్, నర్సన్నపేట, చేబర్తి, పాతూరు, మక్తా మాసాన్ పల్లి, సామలపల్లి, నెంటూర్, బంగ్లవెంకటాపూర్, బెగంపేట్, ఎల్కంటి గ్రామాలకు చెందిన రైతులకు ఇటీవల ఆర్ఆర్ఆర్ నిర్మాణ భూసేకరణకు నోటీసులు వచ్చాయని, అయితే తాము ఇప్పటికే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాలతో భూనిర్వాసితులం అయ్యామని మళ్లీ తమకు మిగిలిన కొద్దిపాటి భూములు ఆర్ఆర్ఆర్‌లో పోతే తాము జీవనాధారం కోల్పోతామని వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మా పరిస్థితిని మానవతా ధృక్పథంతో పరిశీలించి ఆర్ఆర్ఆర్ అలైన్ మెంట్ మార్చేందుకు చొరవ చూపాలని వారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి విన్నవించారు.

Read Also: Ugadi 2024: స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

రైతులతో సుధీర్ఘంగా మాట్లాడిన మంత్రి వారి సాధకబాధకాలను తెలుసుకొని.. తాను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు రైతులు ఆందోళన చెందవద్దని రైతులకు ధైర్యం చెప్పారు. గత ప్రభుత్వం అనాలోచితంగా నిర్మించిన ప్రాజెక్టు వల్ల ప్రజాధనం వృథా అవడమే కాకుండా రైతులు నిర్వాసితులుగా, బాధితులుగా మారారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాల వలన రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. గత ప్రభుత్వంలా ఒంటెద్దు పోకడలు పోకుండా.. ప్రజాస్వామ్యయుతంగా రైతుల సమస్యలను తీర్చుతూనే రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందన పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. గత పదేండ్లుగా మా సమస్యలు చెప్పకుందామంటే ఏ మంత్రి కలిసేవారు కాదని. కానీ ఎలాంటి అపాయింట్ మెంట్ లేకుండా వచ్చినా పండగ వేడుకలను పక్కన పెట్టి తమ సమస్యను ఎంతో ఒపిగ్గా విని ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం చాలా సంతోషం కలిగించిందని వారు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Exit mobile version