ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో గెలవగా.. రెండో టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్స్ తేడాతో గెలుపొందింది. ఇక ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మూడో టెస్టు డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం రోహిత్ సేన బుధవారం బ్రిస్బేన్ చేరుకుంది. ఇప్పటికే సాధన మొదలెట్టింది. అయితే గబ్బా టెస్టులోనూ టీమిండియాకు పేస్ పరీక్ష తప్పలా లేదు.
క్రిస్మస్ తర్వాత కాకుండా వేసవి ఆరంభంలో (ఆస్ట్రేలియాలో) మ్యాచ్ జరుగుతున్నందున గబ్బాలో పిచ్ ఎప్పటిలాగే.. పేస్, బౌన్స్‌కు సహకరించనుంది. గత పర్యటనలోని నాలుగో టెస్టులో రిషబ్ పంత్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఈ మైదానంలో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. అయితే ఆ మ్యాచ్ జనవరిలో జరిగింది. 1988 తర్వాత గబ్బాలో ఓడిపోవడం ఆస్ట్రేలియాకు అదే మొదటిసారి. ఈ నేపథ్యంలోనే గబ్బా మ్యాచ్‌ను ఈసారి ఆస్ట్రేలియా ముందుగా షెడ్యూల్ చేసింది. ఇప్పటివరకు క్రిస్మస్ తర్వాత గబ్బాలో 5 టెస్టులు జరిగగా.. ఆసీస్ మూడు ఓడిపోయింది. మూడు ఓటముల్లో రెండు గత రెండేళ్లలోనే వచ్చాయి. అదీనూ జనవరిలో జరిగిన టెస్టుల్లో ఒడిపియింది. క్రిస్మస్‌కు ముందు గబ్బాలో జరిగిన 61 టెస్టుల్లో ఆసీస్ ఏడు సార్లు మాత్రమే ఓడింది.
ఏడాదిలో భిన్న సమయాల్లో మ్యాచ్ ఉంటే.. పిచ్ కూడా భిన్నంగానే ఉంటుందని గబ్బా స్టేడియం క్యురేటర్ డేవిడ్ సుందర్‌స్కీ చెప్పాడు. సీజన్ ఆఖర్లో పిచ్‌లు కాస్త క్షీణించే అవకాశముందని, సీజన్ ఆరంభంలో సాధారణంగా ఉంటాయన్నాడు. ఇప్పుడు జీవం ఎక్కువగా ఉంటుందని, ఎప్పటిలాగే సంప్రదాయ గబ్బా పిచ్‌ను సిద్ధం చేస్తున్నామని తెలిపేది. గబ్బాలో మంచి పేస్, బౌన్స్ ఉంటాయని క్యురేటర్ స్పష్టం చేశాడు. వర్ష వాతావరణం వల్ల పిచ్‌లో మరింత జీవం ఉండనున్న నేపథ్యంలో భారత బ్యాటర్లకు సవాలు తప్పదు. బ్రిస్బేన్‌లో ఏడు టెస్టులు ఆడిన టీమిండియా.. ఒకసారి మాత్రమే గెలిచింది.