కేరళలో ఏనుగులు మారణహోమం సృష్టిస్తున్నాయి. తాజాగా మరోసారి గజరాజులు విజృంభించాయి. ఏనుగుల దాడిలో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరొకరు మృత్యువాత పడ్డారు. దీంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ఇడుక్కిలోని (Idukki) పర్యాటక పట్టణం మున్నార్ సమీపంలోని కన్నిమల ఎస్టేట్‌లో అడవి ఏనుగు దాడిలో ఒకరు (Kerala Man Killed) మరణించారు. మృతుడు ఇడుక్కికి చెందిన ఆటో డ్రైవర్ సురేష్ కుమార్‌గా (Suresh kumar) గుర్తించారు. ఫిబ్రవరి 26, సోమవారం అర్థరాత్రి సమయంలో వాహనంపై ఏనుగు దాడి చేసింది. ఆ సమయంలో మరికొందరు ప్రయాణికులు ఆటోరిక్షాలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.
ఆటో డ్రైవర్ సురేష్ కుమార్ మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు వివిధ పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున మున్నార్ ప్రాంతంలో నిరసనలు చేపట్టారు. జంతువులు జరిగిస్తున్న మారణహోమాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు సంరక్షణ కల్పించాలని కోరారు.
ఇటీవలే వయనాడ్‌లో (Wayanad) జరిగిన అడవి ఏనుగుల దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలతో ఆ నియోజకవర్గ ఎంపీ రాహుల్‌గాంధీ (Rahul Gandhi) స్పందించారు. ఉత్తరప్రదేశ్‌లో భారత్ జోడో న్యాయ యాత్రలో ఉన్న ఆయన.. యాత్రను వాయిదా వేసుకుని హుటాహుటిన వయనాడ్ వచ్చి ఏనుగుల దాడిలో మృతిచెందిన కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా మరో ఘటన జరగడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు ఏర్పడ్డాయి.
వయనాడ్‌లో ఏనుగుల దాడిలో మరణించిన కుటుంబాలను కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ కూడా పరామర్శించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం, పిల్లల చదువు విషయంలో సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఫిబ్రవరి 10న వాయనాడ్ సమీపంలో 42 ఏళ్ల అజీ అనే వ్యక్తి అడవి ఏనుగు దాడిలో ప్రాణాలు పోయాయి. అటు తర్వాత ఫిబ్రవరి 16న కురువ ద్వీపం సమీపంలో అటవీ శాఖకు చెందిన ఎకో టూరిజం గైడ్ పక్కోం వెల్లచలిల్ వీపీ పాల్ అడవి ఏనుగు చేతిలో హత్యకు గురయ్యాడు.