Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్‌కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం

  • ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్‌కు ఫ్రాన్స్ షాక్
  • దేశంలోకి రాకుండా నిషేధం
  • బెన్-గ్విర్‌ ప్రవర్తనపై ప్రపంచ దేశాలు ఆక్షేపణ
Israelfrance3

Israelfrance3

ఇజ్రాయెల్‌కు చెందిన అతివాద నేత, జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్-గ్విర్‌పై ఫ్రాన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై బెన్-గ్విర్‌కు ఫ్రాన్స్ భూభాగంలోకి ప్రవేశం నిషేధిస్తున్నట్లు ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారో శనివారం ప్రకటించారు. గాజాకు మానవతా సహాయం తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తల బృందంపై జరిగిన వ్యవహారంపై ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న ఆగ్రహం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

“ఇప్పటి నుంచి ఇటమార్ బెన్-గ్విర్‌కు ఫ్రాన్స్‌లోకి ప్రవేశం నిషేధం” అంటూ ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి ఎక్స్‌లో ప్రకటించారు. అలాగే ఇటలీ విదేశాంగ మంత్రితో కలిసి యూరోపియన్ యూనియన్ కూడా బెన్-గ్విర్‌పై ఆంక్షలు విధించాలని కోరుతున్నట్లు వెల్లడించారు.

ఇటీవల గాజాకు మానవతా సహాయం అందించేందుకు బయల్దేరిన కార్యకర్తల ఫ్లోటిల్లాపై ఇజ్రాయెల్ చర్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ సందర్భంగా కార్యకర్తలను అదుపులోకి తీసుకుని నేలకూల్చిన దృశ్యాలను ఎద్దేవా చేస్తూ బెన్-గ్విర్ విడుదల చేసిన వీడియోపై పాశ్చాత్య దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అదుపులో ఉన్న సమయంలో తమపై శారీరక దాడులు జరిగాయని కొందరు కార్యకర్తలు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ జైలు శాఖ ఖండించింది.

ఇక బెన్-గ్విర్ వ్యవహారంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. “బెన్-గ్విర్ ప్రవర్తన ఇజ్రాయెల్ విలువలు, ప్రమాణాలకు అనుగుణంగా లేదు” అని వ్యాఖ్యానించారు. అమెరికా కూడా ఈ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఫ్రాన్స్ నిర్ణయంపై బెన్-గ్విర్ కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.