Naresh Gujral: మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల సైబర్ మోసం.. వాట్సాప్‌ మెసేజ్ తో కొల్లకొగొట్టేసారు.!

Naresh Gujral

Naresh Gujral

Naresh Gujral: దేశ రాజధాని ఢిల్లీలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. మాజీ ప్రధాని ఇందర్ కుమార్ గుజ్రాల్ కుమారుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నరేష్ కుమార్ గుజ్రాల్ రూ.7.80 కోట్ల సైబర్ మోసానికి గురైనట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మంగళవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

పోలీసుల సమాచారం ప్రకారం.. సైబర్ నేరస్థులు అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేశారని తెలిపారు. ప్రస్తుతం మోసపోయిన మొత్తంలో దాదాపు రూ.4 కోట్లను అధికారులు ఫ్రీజ్ చేయడంలో విజయవంతమయ్యారు. దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. నరేష్ గుజ్రాల్ ఫోటోను ఉపయోగించి నిందితులు వాట్సాప్‌లో నకిలీ ఖాతాను సృష్టించారు. అనంతరం ఆయన సిబ్బందిలో ఒకరిని సంప్రదించి తామే నరేష్ గుజ్రాల్ అని నమ్మించారు.

×
×
Ad

తాను ఒక ముఖ్యమైన సమావేశంలో ఉన్నానని, అత్యవసరంగా నిర్దిష్ట బ్యాంకు ఖాతాకు ఆర్‌టీజీఎస్ (RTGS) ద్వారా డబ్బులు బదిలీ చేయాలని సూచించినట్లు పోలీసులు తెలిపారు. నమ్మకంతో సిబ్బంది ఆదేశాలను అమలు చేయడంతో కోట్ల రూపాయలు మోసగాళ్ల ఖాతాల్లోకి వెళ్లాయి. ఈ మోసం జరిగిన విషయం నరేష్ గుజ్రాల్ కుమార్తె దీక్షా గుజ్రాల్ అప్రమత్తతతో బయటపడింది. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీ జరిగినట్లు ఒక ఉద్యోగి ఆమెకు సమాచారం ఇచ్చాడు.

దీంతో వెంటనే ఆమె తన తండ్రిని సంప్రదించి నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని నరేష్ గుజ్రాల్ చెప్పడంతో కుటుంబ సభ్యులు సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించారు. ఘటన తెలుసుకున్న వెంటనే దీక్షా గుజ్రాల్ జాతీయ సైబర్ మోసాల హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఈ-ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు. సమాచారం అందుకున్న సైబర్ క్రైమ్ అధికారులు వేగంగా స్పందించి బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా డబ్బుల బదిలీని ట్రాక్ చేశారు. ఈ చర్యల ఫలితంగా మోసపోయిన మొత్తంలో దాదాపు 70% నిధులను ఫ్రీజ్ చేయగలిగారు.

ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల సైబర్ సెల్ కేసును లోతుగా దర్యాప్తు చేస్తోంది. డబ్బు ఏ ఖాతాలకు వెళ్లింది.? ఈ మోసంలో ఎవరెవరు పాల్గొన్నారు.? నకిలీ వాట్సాప్ ఖాతాను ఎక్కడి నుంచి నిర్వహించారు వంటి అంశాలపై విచారణ కొనసాగుతోంది. మోసగాళ్లను గుర్తించి నిధులను పూర్తిగా తిరిగి పొందేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నరేష్ గుజ్రాల్ వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. ఆయన శిరోమణి అకాలీ దళ్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు. 2007 నుంచి 2022 వరకు పంజాబ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో జలంధర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. నరేష్ గుజ్రాల్ భారత మాజీ ప్రధాని ఇందర్ కుమార్ గుజ్రాల్ కుమారుడు. ఇందర్ కుమార్ గుజ్రాల్ 1997 నుంచి 1998 వరకు దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.