Site icon NTV Telugu

RK Roja: పంచె ఎగ్గాట్టాల్సింది గుడి మెట్లపై కాదు.. పవన్‌పై రోజా ట్వీట్

Rk Roja

Rk Roja

RK Roja: పిఠాపురంలో మైనర్‌ బాలికకు మద్యం తాగించి బలాత్కారం చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. దీనిపై వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో మహిళలకు భద్రత లేదా అంటూ ప్రశ్నింస్తోంది. ఇదే విషయమై వైసీపీ అధికార ప్రతినిధి రోజా కూడా పవన్‌ కల్యాణ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఉపముఖ్యమంత్రి ఇలాకాలోనే మైనర్ బాలికపై దారుణం జరిగితే చర్యలేవంటూ ప్రశ్నించారు. ఈ మేరకు మాజీ మంత్రి రోజా ఎక్స్ వేదికగా పవన్‌కు ట్వీట్ చేశారు.

Read Also: Deputy CM Pawan Kalyan: బాలికపై అఘాయిత్యం అమానుషం..

“పవన్ కళ్యాణ్ అనబడే ఉప ముఖ్యమంత్రి గారూ.. మీరు పంచె ఎగ్గాట్టాల్సింది గుడి మెట్లపై కాదు.. విజయవాడ వరద బాధితుల కోసం!. మీరు ధర్మం ధర్మం అని అరవాల్సింది..నడి రోడ్డు పై కాదు….వైజాగ్ స్టీల్ కార్మికుల కోసం! మీరు గొడవపడాల్సింది… మతాల కోసం కాదు… నీట మునిగి… సాయమందని పేదల కోసం! మీరు కడగాల్సింది… మెట్లను కాదు…ఇసుక లేకుండా చేస్తున్న మీ నాయకుల అవినీతిని…! మీరు దీక్ష చేయాల్సింది … ప్రసాదాల కోసం కాదు…రాష్ట్రంలో రాలి పోతున్న…ఎంతో మంది చిన్న పిల్లల మాన ప్రాణాల కోసం! మీరు ఉపవాసం ఉండాల్సింది… దేవుళ్ల కోసమే కాదు…ఎక్కడ చూసినా.. ఆహారం కలుషితమై.. ఆసుపత్రి పాలౌతున్న… విద్యార్థుల కోసం!మీరు బొట్లు పెట్టాల్సింది..గుడి మెట్లకు కాదు..నాడు నేడుని… కొనసాగించి… బాగుపరిచిన .. బడి మెట్లకు! మీరు డిక్లరేషన్ ప్రకటించాల్సింది.. ఇప్పుడు ఏ లోటు లేని… సనాతనం కోసం కాదు.. మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన జనాల కోసం! మీరు ఆపసోపాలు పడాల్సింది… కొండెక్కడం కోసం కాదు… రాష్ట్రం లో క్షీణిస్తున్న… శాంతి భద్రతలు అరికట్టడం కోసం! మీరు సంప్రోక్షణ చేయాల్సింది… కల్తీ జరిగిందో లేదో తెలియని .. లడ్డూ కోసం కాదు.. ప్రజలకు ఇసుకే దొరకకుండా చేసిన… కూటమి నాయకయుల అవినీతి ప్రక్షాళన కోసం! మీరు దృష్టి పెట్టాల్సింది పక్క రాష్ట్రాల నాయకుల మాటపై కాదు.. మీ నియోజకవర్గంలో వికృత చేష్టలకు పాల్పడుతున్న మీ నాయకులపైన..! దేవుడు తమరికి పుట్టుకతో బుద్ది జ్ఞానం ఇచ్చి ఉంటే దాన్ని కాస్త ఉపయోగించండి పవన్‌ కల్యాణ్” అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా.. పిఠాపురం ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. పిఠాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద నిన్న సాయంత్రం అఘాయిత్యం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆ సమయంలో అప్రమత్తమైన స్థానికులు నిందితుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చిందని పవన్ తెలిపారు. లేనిపక్షంలో నిందితుడు తప్పించుకోడానికి ఆస్కారం కలిగేదన్నారు. ఈ అమానుష చర్యను సభ్యసమాజంలోని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ దుస్సంఘటన గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా బాధితురాలిని, వారి కుటుంబ సభ్యులకు సహాయసహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ముద్దాయికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. స్థానిక జనసేన నాయకులను కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి, సహాయం అందించాలని స్పష్టం చేశామని పవన్ కల్యాణ్ తెలిపారు.

Exit mobile version