NTV Telugu Site icon

Manish Sisodia: కొడుకు కాలేజీ ఫీజుల కోసం అడుక్కున్న: మనీష్ సిసోడియా

Manishsisodia

Manishsisodia

ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆదివారం తన పాత రోజులను గుర్తుచేసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ‘స్కామ్’లో తనను అరెస్టు చేసిన సమయంలో.. ఈడీ తన బ్యాంక్ ఖాతాను స్తంభింపజేసిందని, ఈ కారణంగా అప్పు చేయాల్సి వచ్చిందన్నారు. తన కొడుకు కాలేజీ ఫీజు కోసం కూడా ‘భిక్షాటన’ చేయవలసి వచ్చిందన్నారు. మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ‘‘2002లో నేను జర్నలిస్టుగా ఉన్నప్పుడు రూ. 5 లక్షల విలువైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశాను. దాన్ని లాక్కున్నారు. నా ఖాతాలో రూ.10 లక్షలు ఉన్నాయి. అది కూడా విత్‌డ్రా అయిపోయింది. నా కొడుకు ఫీజు కట్టేందుకు సాయం చేయమని వేరేవాళ్లని వేడుకున్నా.” అని ఆయన వ్యాఖ్యానించారు.

READ MORE: Bhagwant Mann: ఖలిస్తానీ మద్దతుదారు అమృత్ పాల్ సింగ్ నుంచి పంజాబ్ సీఎంకి ప్రాణహాని..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో సిసోడియా ఇటీవలే సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందారు. ఫిబ్రవరి 2023లో సిసోడియాను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉండగా.. ఆదివారం ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్వహించిన ‘జనతా కీ అదాలత్’లో ఈ విషయాలను మనీష్ పంచుకున్నారు. కేజ్రీవాల్‌తో తనకున్న అనుబంధాన్ని ‘రామ్ అండ్ లక్ష్మణ్’గా అభివర్ణించారు. సిసోడియా మాట్లాడుతూ.. “నాకు బిజెపిలో చేరడానికి ఆఫర్ వచ్చింది. అనారోగ్యంతో ఉన్న నా భార్య, నా కొడుకు గురించి ఆలోచించమని బీజేపీ నేతలు చెప్పారు. మీరు లక్ష్మణుడిని రాముడి నుంచి వేరు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా చేసే శక్తి ఏ రావణుడికీ లేదు.” అని ఆయన పేర్కొన్నారు.