Site icon NTV Telugu

Sonia Gandhi: సోనియాగాంధీకి అస్వస్థత.. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేరిక

Sonia Gandhi

Sonia Gandhi

Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. జ్వరం రావడంతో గురువారం ఆస్పత్రికి తరలించగా.. వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. సర్ గంగారాం హాస్పిటల్ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ చెస్ట్ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అరూప్ బసు పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. జ్వరం రావడంతో మార్చి 2న అంటే గురువారం అడ్మిట్‌ అయ్యారు. ఆమె నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ పలు పరీక్షలు చేయించుకుంటున్నారు. సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉండగా.. సోనియా గాంధీ ఆరోగ్యం క్షీణించింది. రాహుల్‌గాంధీ ఉపన్యాసం ఇచ్చేందుకు యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆయన అన్నారు. భారత ప్రజాస్వామ్యం ప్రాథమిక నిర్మాణంపై దాడి జరిగిందని ఆరోపిస్తూ, ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్ తన ఫోన్‌లోకి స్నూప్ చేయడానికి ఉపయోగించబడుతుందని ఆరోపించారు. తన కాల్‌లు రికార్డ్ అవుతున్నందున ఫోన్‌లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇంటెలిజెన్స్ అధికారులు తనను హెచ్చరించారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Read Also: Superstition : శీలపరీక్షకు సిద్ధమైన యువకుడు.. నిప్పుల్లో ఉన్న గడ్డపారను తీసి.. చివరికి

జనవరిలో కూడా సోనియా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన సంగతి తెలిసిందే. జనవరి 5న సోనియా గాంధీ ఆరోగ్యం క్షీణించడంతో గంగారాం ఆసుపత్రిలో చేరారు. అప్పుడు ఆమె వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరారని, అక్కడ వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ తన తల్లి వెంట ఉన్నారు.

Exit mobile version