Woman Premier League: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జట్ల వేలం బీసీసీఐకి ఊహించని రీతిలో కాసుల వర్షం కురిపించింది. ఆరంభ లీగ్‌లోనే ఐదు జట్ల అమ్మకానికిగానూ బోర్డుకు రూ. 4669.99 కోట్ల ఆదాయం సమకూరింది. బీసీసీఐ సెక్రటరీ జే షా బుధవారం ట్విటర్‌లో మొత్తం బిడ్డింగ్ ధర వివరాలను తెలియజేశారు. ఈ టోర్నీకి బీసీసీఐ మహిళల ప్రీమియర్ లీగ్‌గా పేరు పెట్టిందని జై షా తెలిపారు. 2008లో ప్రారంభ పురుషుల ఐపీఎల్ కోసం జట్ల బిడ్డింగ్ ద్వారా పొందిన దాని కంటే బిడ్డింగ్ మొత్తం ద్వారా వచ్చిన మొత్తం ఎక్కువ అని ఆయన వెల్లడించారు. బిగ్‌బాష్ లీగ్, హండ్రెడ్ లీగ్ సహా ఏ దేశవాళీ లీగ్ కూడా డబ్ల్యూపీఎల్‌కు దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం. బుధవారం ముంబైలో ఐదు జట్లు అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, లఖ్‌నవూలకు సంబంధించిన బిడ్‌లను బీసీసీఐ ఖరారు చేసింది. మొత్తం 17 బిడ్‌లు దాఖలైనట్లు బోర్డు వెల్లడించింది.
అహ్మదాబాద్ టీమ్‌ను అదానీ స్పోర్ట్స్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్ అత్యధికంగా రూ.1289 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ముంబై ఫ్రాంచైజీని ముంబై ఇండియన్స్ యాజమాన్యంలోని ఇండియావిన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.912.99 కోట్లకు గెలుచుకుంది. బెంగళూరు ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యంలోని రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 901 కోట్ల రూపాయలకు ఖరీదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ యజమానులైన జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్, ఢిల్లీ ఫ్రాంచైజీని రూ. 810 కోట్ల బిడ్‌తో గెలుచుకోగా, లక్నో ఫ్రాంచైజీని రూ. 757 కోట్లకు కాప్రీ గ్లోబల్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది.
Suresh Raina: సూర్యకుమార్ యాదవ్ లేకుండా మూడు ఫార్మాట్లూ ఉండవు..
ప్రసార హక్కుల ద్వారా సమకూరిన రూ. 951 కోట్లతో కలిపి.. ఒక్క బంతికూడా పడకుండానే మహిళల ప్రీమియర్ లీగ్ ద్వారా బోర్డు రూ. 5,650.99 కోట్ల రెవెన్యూ ఆర్జించినట్టయింది. కోల్‌కతా రూ. 666 కోట్ల బిడ్ వేసినా.. మిగతా పోటీదారులు అంతకంటే ఎక్కువ కోట్ చేశారు. దాఖలైన టెండర్లలో రాజస్థాన్ రాయల్స్ రూ. 180 కోట్ల బిడ్ అన్నింటికంటే అత్యల్పం. 2008లో ఐపీఎల్ టీమ్‌ల ద్వారా వచ్చిన దానికంటే ఈ మొత్తం ఎంతో ఎక్కువని బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పాడు.
ఫ్రాంచైజీ-జట్లు-ధర
అదానీ స్పోర్ట్స్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్- అహ్మదాబాద్- రూ. 1289 కోట్లు
ఇండియావిన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్-ముంబై- రూ. 912.99కోట్లు
రాయల్ చాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్- బెంగళూరు- రూ. 901 కోట్లు
జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్- ఢిల్లీ- రూ. 810 కోట్లు
కాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్- లఖ్‌నవూ- రూ. 757 కోట్లు