NTV Telugu Site icon

INDIA Bloc: సాయంత్రం ఖర్గే ఇంట్లో ఇండియా కూటమి నేతల భేటీ.. స్పీకర్ ఎన్నికపై చర్చ

Indje

Indje

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో రాత్రి 8 గంటలకు ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్లు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే సోమవారం నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా ప్రమాణస్వీకారం చేశారు. ఇక బుధవారం లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇందుకోసం నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా స్పీకర్‌ పదవికి పోటీ నెలకొంది. ఎన్డీఏ కూటమి నుంచి ఓం బిర్లా నామినేషన్ వేయగా.. ఇండియా కూటమి నుంచి కె.సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో స్పీకర్ ఎన్నికకు పోటీ నెలకొంది.

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి పోటాపోటీగా సీట్లు గెలుచుకున్నాయి. ఎన్డీఏ కూటమి 293 సీట్లు గెలుచుకోగా.. ఇండియా కూటమి 233 సీట్లు గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ సొంతంగా 99 సీట్లు గెలుచుకుని ప్రతిపక్ష హోదాను సంపాదించింది. అయితే ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ పదవిని ఆశిస్తోంది. ఈ పదవి ఇస్తే.. ఎన్డీఏ కూటమి బలపరిచిన స్పీకర్ అభ్యర్థికి సపోర్టు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఒకవేళ అంగీకరించకపోతే స్పీకర్ పోస్టుకు పోటీ చేస్తామని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Prize Money: కోట్లు గెలిచాడు.. సంతోషంలో గుండెపోటుతో పోయాడు..

కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. డిప్యూటీ స్పీకర్ పోస్టుపై ఎన్డీఏ నిర్ణయానికి ఎదురుచూస్తున్నామన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే.. తాము ఎన్డీఏ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రధాని మోడీ విజ్ఞప్తి చేసినట్లుగా ఉభయ సభల్లో సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని వెల్లడించారు. అలాగే కేంద్రం కూడా ప్రతిపక్షాలను గౌరవించవలసి ఉంటుందన్నారు. కాంగ్రెస్ హయాంలో 10 ఏళ్లు డిప్యూటీ స్పీకర్‌ పదవిని విపక్షాలకు ఇచ్చినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. అలాగే లోక్‌సభలో కూడా ఇవ్వాలని వేణుగోపాల్ డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Kalki 2898 AD: “నన్ను చంపొద్దు ప్లీజ్” ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అమితాబ్.. ఎందుకో తెలుసా?