NTV Telugu Site icon

Godavari-Sabari: కూనవరం సంగమం వద్ద ఉధృతంగా శబరి-గోదావరి నదులు

Koonavaram

Koonavaram

Godavari-Sabari: గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. శబరి నది గోదావరిలో సంగమించే ప్రదేశమైన కూనవరం వద్ద గోదావరి వేగంగా పెరుగుతోంది. కూనవరం వద్ద గోదావరి ప్రస్తుతం 51 అడుగుల నీటిమట్టంతో ప్రవహిస్తోంది.చింతూరు వద్ద 40 అడుగులకు శబరి నది పెరిగింది. కూనవరం సంగమం వద్ద శబరి – గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే విలీన మండలాల ప్రజల్లో భయాందోళన నెలకొంది. నీటిమట్టం పెరిగిన నేపథ్యంలో పోలీస్‌, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ముందస్తుగా నిత్యావసర వస్తువులను మర పడవల్లో పునరావాస కేంద్రాలకు తరలించారు.

గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. నిర్వాసితులకు పునరావాస ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. రెండు మండలాల్లోని సుమారు 25 గ్రామాలు ముంపు బారిన పడనున్న నేపథ్యంలో వారికి ముందస్తు చర్యలో భాగంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ముంపు మరింత పెరిగే అవకాశం ఉన్న గ్రామాలను ముందుగానే ఖాళీ చేయిస్తున్నారు. కుక్కునూరు మండలంలో ఇప్పటికే వందలాదిమంది నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించి సౌకర్యాలు కల్పిస్తున్నారు.

ఆందోళనలో లంక గ్రామాలు
అంబేద్కర్ కోనసీమ జిల్లా ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరికతో లంక గ్రామాలలో టెన్షన్ నెలకొంది. వశిష్ట ,వైనతేయ, వృద్ధ గౌతమి పాయల నుంచి రేపు ఉదయానికి లంక గ్రామాలకు వరద నీరు భారీగా చేరుకోనుంది. 75 లంక గ్రామాలు రెండు రోజుల క్రిందటి వరకు ముంపులోనే ఉన్నాయి. మళ్లీ వరద ముంచెతత్తనుండడంతో లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాలలో వరద ప్రభావం భారీగా ఉంది. పొలాల నుంచి ఇప్పుడిప్పుడే వరద నీరు తగ్గుతుండగా.. మళ్లీ వస్తున్న ప్రవాహంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరద మిగిల్చిన నష్టం నుంచి కోలుకునే లోపు మళ్లీ గోదావరి ఉగ్రరూపంతో పునరావాస కేంద్రాలకు వెళ్లడానికి లంకవాసులు సిద్ధమయ్యారు. అన్నంపల్లి ఆక్విడేట్‌కి భారీగా వరద నీరు వస్తోంది.