NTV Telugu Site icon

Students Missing: కృష్ణానదిలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం.. శోకసంద్రంలో కుటుంబసభ్యులు

Students Missing

Students Missing

Students Missing in Krishna River: విజయవాడకు సమీపంలోని యనమలకుదురు వద్ద కృష్ణానదిలో సరదాగా ఈత కొట్టడానికి వచ్చి గల్లంతైన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న ఇద్దరివి దొరకగా.. మిగతా ముగ్గురి మృతదేహాలను సహాయక బృందాలు నేడు వెలికితీశాయి. ఆ మృతదేహాలను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పటమట ప్రాంతంలోని దర్శిపేట అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన షేక్‌ బాజీ (15), షేక్‌ హుస్సేన్‌ (15), తోట కామేష్‌ (15), మద్దాల బాలు (17), ఇనకొల్లు గుణశేఖర్‌ (14), పిన్నింటి శ్రీను, షేక్‌ ఖాశిం అలీలు ఏడుగురు స్నేహితులు కాగా.. శుక్రవారం సరదాగా కృష్ణానదిలో ఈత కొట్టడానికి వెళ్లారు.

Thatikonda Rajaiah : నియోజకవర్గంలో ఎవరు పనులు చేసినా నా ఖాతాలోకే

వీరిలో శ్రీను ఒడ్డునే ఉండిపోయాడు. నీరు ఎక్కువగా ఉన్న చోట ఈత కొడదామని షేక్‌ బాజీ చెప్పడంతో అందరూ చేతులు పట్టుకొని లోపలకు వెళ్లారు. పదడుగులు వేయగానే ఒక్కసారిగా లోతుగా ఉన్న గుంతల్లోకి జారిపోయారు. నీటి ఉరవడి ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయారు. ఒడ్డున ఉన్న శ్రీను భయాందోళనలతో పెద్దగా కేకలు వేయగా స్థానిక మత్స్యకారుడు ఏడుకొండలు అక్కడకు చేరుకుని.. ఖాసింవలిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. మిగిలిన ఐదుగురు చిన్నారులు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న పెనమలూరు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు, రెస్కూ సిబ్బంది సాయంతో శివలింగాల గట్టు ప్రాంతంలో గాలించారు. నిన్న రెండు మృతదేహాలు వెలికి తీయగా, ఈరోజు మిగిలిన ముగ్గురు విగత జీవులయ్యారు. దాంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. చనిపోయిన బిడ్డలను చూసి కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు.