మెక్సికో ఎన్నికల ఫలితాలు ఈసారి చరిత్ర సృష్టించాయి. తొలిసారిగా ఓ మహిళ మెక్సికో అధ్యక్షురాలయ్యారు. మహిళా అధ్యక్ష అభ్యర్థి క్లాడియా షీన్‌బామ్ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పుడు ఆమె అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారు. దాదాపు 200 ఏళ్ల చరిత్రలో దేశానికి తొలిసారి ఓ మహిళ అధ్యక్షురాలిగా వ్యవహరించనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపేజ్ ఒబ్రాడర్ స్థానంలో అక్టోబర్ ఒకటో తేదీన షీన్‌బామ్ బాధ్యతలు చేపట్టనున్నారు. అక్కడి సర్వేల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా షీన్‌బామ్ గెలుస్తారని, 50-60 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశాయి. మెక్సికోకు చెందిన INE ఎలక్టోరల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాపిడ్ శాంపిల్ కౌంటింగ్ ప్రకారం.. మెక్సికో అధ్యక్ష ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి క్లాడియా షీన్‌బామ్ విజయం సాధించారు. 13 కోట్ల జనాభా కలిగిన మెక్సికోలో దాదాపు 10 కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు.
READ MORE: Kavitha: లిక్కర్ కేసులో కవిత కస్టడీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..!
క్లాడియా షీన్‌బామ్ ఓ ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త, 2007లో నోబెల్ గ్రహీత, మెక్సికో సిటీ మాజీ మేయర్ గా కూడా పనిచేశారు. షీన్‌బామ్ తొలి అధ్యక్షురాలే కాదు.. యూదు మూలాలున్న తొలి వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించారు. అధ్యక్షుడు ఆంద్రెజ్ మాన్యుయెల్ లోపెజ్ అబ్రేడర్‌కున్న విశేషమైన జనాదరణ ఉన్నా రెండోసారి పదవి చేపట్టేందుకు మెక్సికో రాజ్యాంగ ప్రకారం అనుమతించని కారణంగా పాలక సంకీర్ణ అభ్యర్థిగా షేన్‌బామ్ బరిలో దిగారు. క్లాడియా 1962 జూన్ 24న మెక్సికోలో జన్మించారు. షీన్‌బామ్ కుటుంబం బల్గేరియా నుంచి మెక్సికోకు వచ్చి స్థిరపడింది. నేషనల్ అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికో నుంచి ఎనర్జీ ఇంజనీరింగ్ విభాగంలో పీహెచ్డీ చేశారు. క్లాడియా ఒక శాస్త్రవేత్త. కాలిఫోర్నియాలోని ఓ ల్యాబ్లో మెక్సికో ఇంధన వినియోగంపై పరిశోధనలు చేశారు. శాస్త్రవేత్తగా కేరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత 2018లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సంవత్సరంలో సిటీ మేయర్గా బాధ్యతలు చేపట్టారు. ఆమెకు ప్రస్తుతం ఈ బాధ్యత వరించింది.