సికింద్రాబాద్ లోని రూబీ హోటల్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేసింది. సికింద్రాబాద్ రూబీ లాడ్జి అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు పరిహారం కూడా ప్రకటించాయి. మృతుల కుటుంబాలకు పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుండి రూ.2 లక్షలు ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం ఇస్తామని ప్రధాని మోడీ వెల్లడించారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్, మృతుల కుటుంబాలకు 3 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనలో 8మంది మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా వివిధ రాష్ట్రాలకు చెందినవారు.
ఈ విషాదంపై ఫైర్ డిపార్ట్‌మెంట్ నివేదిక అందచేసింది. ఇందులో అనేక విషయాలు పొందుపరిచింది. వీడియో కూడా విడుదల చేసింది. 3 పేజీల నివేదికలో కీలక విషయాలు వున్నాయని ఫైర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. లిథియం బ్యాటరీ పేలుళ్ల వల్ల దట్టమైన పొగలు వ్యాపించాయి. దట్టమైన పొగల వల్ల ఫైర్ సిబ్బంది భవనంలోకి వెళ్లలేకపోయారని పేర్కొంది. ఈ భవనానికి ఒకే ఎంట్రీ, ఎగ్జిట్ మాత్రమే ఉందని ఫైర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
లిఫ్ట్ పక్కన మెట్లు ఏర్పాటు చేయకూడదన్న నిబంధన పట్టించుకోలేదు. అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసినా అవి పనిచేయడం లేదు. భవనం మొత్తం కూడా క్లోజ్డ్ సర్క్యూట్‌లో ఉండిపోయిందని ఫైర్ డిపార్ట్‌మెంట్ తన నివేదికలో వివరించింది. భవనానికి కనీసం కారిడార్ కూడా లేదు. భవనంలో ఎలాంటి ఓవర్ హెడ్‌ట్యాంక్ కూడా ఏర్పాటు చేయలేదు. భవన, హోటల్ యజమాని నిర్లక్ష్యంతోనే అగ్నిప్రమాదం సంభవించిందని ఫైర్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. అగ్ని ప్రమాదం సెల్లార్‌లోనే జరిగిందని ఫైర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. తర్వాత మంటలు మొదటి అంతస్తు వరకు వ్యాపించాయని ఫైర్ డిపార్ట్‌మెంట్ వివరించింది.