Train Accident: ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాద ఘటనను మరువకముందే మరో ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. సీల్దా-అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ కోచ్‌లలో ఒకదానిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. పొగలు వ్యాపించడంతో ప్రయాణికులలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో అజ్మీర్‌కు వెళ్లే రైలు వెనుక నుంచి మూడో కోచ్‌లో మంటలు వ్యాపించాయి. కొంతమంది ప్రయాణీకులు చైన్ లాగిన తర్వాత రైలు ఆగిపోయింది. ప్రజలు వెంటనే రైలు నుంచి కిందికి దిగిపోయారు. కొందరు కిటికీల నుంచి దూకారు. సీల్దా-అజ్మీర్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే స్టేషన్‌లో నిలిపివేసి, జనరల్ కోచ్‌లోని మంటలను దాదాపు 30 నిమిషాల్లో ఆర్పివేసినట్లు భర్వారీ స్టేషన్ స్టేషన్ సూపరింటెండెంట్ డీఎన్ యాదవ్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు రైలు గమ్యస్థానానికి బయలుదేరిందని, ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదని ఆయన తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.
Read Also: Beers Looted: బీరు సీసాలతో వెళ్తున్న వ్యాన్ బోల్తా.. నిమిషాల్లోనే..
ఇదిలా ఉండగా.. సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్‌ప్రెస్‌ను ఒడిశాలోని బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్‌లో మధ్యాహ్నం సమయంలో నిలిపివేశారు. కోచ్‌లోని ఎయిర్ కండిషనింగ్ యూనిట్ నుండి పొగలు వెలువడుతున్నాయని ప్రయాణికులు రైల్వే అధికారులను అప్రమత్తం చేశారని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి అగర్తలా వెళ్తున్న రైలు బెర్హంపూర్ స్టేషన్‌కు చేరుకోగానే బీ5 కోచ్‌లో మంటలు చెలరేగాయి. రైలులో పొగ రావడం చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. రైలులో ప్రయాణిస్తున్న కొంతమంది బీ5 కోచ్ నుంచి పొగ రావడం చూసి.. అత్యవసర అలారంను మోగించారు. మరికొంత మంది రైలునుంచి దిగి అందులో ప్రయాణించేది లేదని తేల్చి చెప్పారు. తక్షణమే మరొక కోచ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన కోచ్‌ను అధికారులు పరిశీలించారు. 45 నిమిషాల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలు ఆర్పిన తర్వాత రైలు స్టేషన్ నుంచి బయలుదేరింది. ఎయిర్ కండిషనర్‌లో జరిగిన చిన్న షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ మంటలు వచ్చి పొగలు వ్యాపించాయని చెప్పారు.