స్మార్ట్ ఫోన్.. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది. అరచేతిలో ఇమిడిపోయే ఈ వస్తువు ప్రపంచాన్నే మన ముందుకు తెస్తోంది. రైలు టికెట్ బుకింగ్ నుంచి బ్యాంక్ ఖాతా ఓపెనింగ్ వరకు ప్రతీ పనిని స్మార్ట్ ఫోన్‌తో చేసే రోజులు వచ్చేశాయ్. మనిషి జీవితంలో స్మార్ట్ ఫోన్ ఒక తప్పనిసరి వస్తువుగా మారిపోయింది. అయితే ఇదంతా బాగానే ఉన్నా అవసరానికి ఉపయోగపడే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఒక వ్యసనంలా మారుతోంది. ఒక్క క్షణం చేతిలో ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయిన భావన కలుగుతోంది. ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి టీనేజర్ల వరకు గంటల తరబడి ఫోన్‌లోనే గడుపుతున్నారు. దీనికి తోడు ‘మెసేజింగ్ యాప్‌లు’ భారీగా వచ్చాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను తమ ఫోన్‌లను తక్కువగా ఉపయోగించకుండా ఆపినప్పుడు, పిల్లలు వినరు. ఏదో ఒక ఆఘాయిత్యానికి పాల్పడుతున్నారు.
READ MORE: Kalki 2898 AD: కల్కి అడ్వాన్స్ బుకింగ్.. మొదటి రోజు ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయో తెలుసా..?
తాజాగా మహారాష్ట్రలో, ఒక తండ్రి తన మైనర్ కుమార్తెని ఆమె ఫోన్‌లో యాప్ డౌన్‌లోడ్ చేయవద్దని చెప్పాడు. దీంతో కుమార్తె ఆ తండ్రికి గుండె కోత మిగిల్చింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర థానే జిల్లా డోంబివాలి ప్రాంతంలోని నీల్జేలో నివాసముంటున్న ఓ తండ్రి తన 16 ఏళ్ల కుమార్తెకు ఫోన్ కొనిచ్చారు. తన మైనర్ కుమార్తె మొబైల్ ఫోన్‌లో ‘స్నాప్‌చాట్’ డౌన్‌లోడ్ చేసుకోవడానికి తండ్రి నిరాకరించారు. అప్పటికే ఆ అమ్మాయి తన మొబైల్ ఫోన్‌లో స్నాప్‌చాట్ యాప్ డౌన్‌లోడ్ చేసినట్లు గుర్తించిన తండ్రి ఈ మేరకు సూచన చేశారు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక శుక్రవారం రాత్రి తన ఇంట్లోని ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై సమాచారం అందుకున్న మాన్‌పాడ స్టేషన్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.