Ambulance Mafia: ఏపీలో అంబులెన్స్ మాఫియా ఆగడాలు కొనసాగుతున్నాయి. గతంలో తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్స్ డాక్టర్ల నిర్వాకం పలు విమర్శలకు దారి తీసిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా తిరుపతి జిల్లాలో అలాంటి ఘటన మరోసారి చోటుచేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలంలో ఓ బాలుడు పాముకాటుతో మృతి చెందాడు. దిగువ పుత్తూరు గ్రామంలో బాలుడు బసవయ్య పాము కాటు కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స కోసం కుటుంబ సభ్యులు బాలుడిని కేవీబీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే ఆరోగ్యకేంద్రానికి వెళ్లేసరికి బాలుడు బసవయ్య చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
Read Also: Coach Restaurant: రైల్వే స్టేషన్‌లో కోచ్ రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా?
అయితే కేవీబీ పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి బాలుడు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రైవేట్ వాహన యజమానులు నిరాకరించారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కుమారుడి మృతదేహాన్ని తండ్రి చెంచయ్య బైక్‌పై తీసుకువెళ్లాల్సి వచ్చింది. అయితే చిన్నారి మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లడాన్ని చూసి స్థానికులు చలించిపోయారు. కాగా ప్రభుత్వాసుపత్రుల దగ్గర ప్రైవేటు అంబులెన్సుల దందా రోజురోజుకు మితిమీరిపోతుందని.. వారిని కట్టడి చేయడంలో అధికార యంత్రాంగం తీవ్రంగా విఫలమవుతోందని పలువురు మండిపడుతున్నారు.