Site icon NTV Telugu

Penumuru Farmer incident: కోర్టులో గెలిచాడు.. రెవిన్యూ అధికారుల ముందు ఓడిపోయాడు

Farmer

Farmer

మనదేశంలో Justice Delayed is Justice Denied అంటారు. న్యాయం ఆలస్యం అయి ఓ నిండుప్రాణం గాల్లో కలిసిపోయింది. తన భూమి కోసం న్యాయస్థానంలో గెలిచిన ఓ రైతు… రెవెన్యూ అధికారులు నుందు ఓడిపోయారు… కబ్జాకు గురైన తన భూమి కోసం పోరాటం చేస్తున్న పోరాటంలో అ రైతు గుండె ఆగింది. చిత్తూరు జిల్లా పెనుమూరు తహసీల్దార్ కార్యాలయంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తన భూమిని ఆక్రమించుకున్నారంటూ అధికారుల ముందు వాపోతూ ఒక్కసారిగా తహసీల్దార్ కార్యాలయంలోనే కుప్పకూలి మరణించాడు రైతు రత్నం…ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

చిత్తూరు జిల్లా పెనుమూరు తహసీల్దార్ కార్యాలయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. తన భూ సమస్యను పరిష్కరించాలంటూ రెండు రోజులుగా తహసీల్దార్ ఆఫీసు ముందు రైతు రత్నం నిరసన వ్యక్తం చేస్తున్నాడు. 40ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిని మరొకరు ఆక్రమించుకున్నారంటూ రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకుంటున్నాడు. సమస్య పరిష్కారం కాకపోవడంతో కార్యాలయం ఎదుటే బైఠాయించాడు రైతు రత్నం. దీంతో తహసీల్దార్ ఆఫీసు సిబ్బంది స్పందించారు. మాట్లాడాలి అంటూ పోలీసుల సాయంతో రైతుని ఆఫీసులోకి తీసుకెళ్లారు.

భూ సమస్యను పరిష్కరించి తనకు న్యాయం చేయాలని రైతు రత్నం అధికారులను వేడుకుంటూ కుప్పకూలి గుండెపోటుతో మరణించాడు. పెనుమూరు మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన రైతు రత్నం.. తన 2 ఎకరాల 50 సెంట్ల భూమి కోసం ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. తన భూమిని ఇప్పించాలంటూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. చనిపోవడానికి రెండు రోజుల ముందు కలెక్టర్‌ సహా ఉన్నతాధికారులకు రైతు చేసిన ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది. పెనుమూరు మండలం రామకృష్ణాపురం గ్రామం తన సొంత ఊరు అని ఫిర్యాదులో పేర్కొన్న రైతు..తనకు 2 ఎకరాల 50 సెంట్ల భూమి ఉందని తెలిపారు. 1974లో ఈ భూమికి ప్రభుత్వం పట్టా మంజూరు చేసిందని.. అప్పటినుంచి భూమి తమ ఆధీనంలోనే ఉందన్నారు. తిమ్మరాజు కండ్రిగ గ్రామస్థులు కొందరు తనను ఆ భూమిలోకి రాకుండా అడ్డుకుంటున్నారని.. దీనిపై చిత్తూరు కోర్టులో కేసు వేశానన్నారు.

ఈ నిర్లక్ష్యానికి బాధ్యులెవరు?

1981లో కోర్టు తనకు అనుకూలంగా ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చిందని.. ఆ తర్వాత తనపై హత్యాయత్నం చేశారన్నారు. 2000సంవత్సరం నుంచి భూమిని తిరిగి సాగు చేసుకుంటున్నానన్న రైతు.. మళ్లీ ప్రత్యర్థులు కబ్జా చేసేందుకు యత్నించారన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో.. మళ్లీ కోర్టును ఆశ్రయించి స్టేటస్‌కో ఉత్తర్వులు పొందానని తెలిపారు. అయినా తర్వాత నుంచి ఇప్పటి వరకూ ఇబ్బందికి గురి చేస్తూనే ఉన్నారని..2016లో కోర్టు తనకు పూర్తిస్థాయి అనుమతి ఇచ్చినా.. తహసీల్దార్‌ తప్పుడు సమాచారం పంపడంతో కలెక్టర్‌ దగ్గరా తనకు న్యాయం లభించలేదంటూ అ లేఖలో రాశాడు రైతు రత్నం…

కలెక్టర్‌ దగ్గరా న్యాయం జరగకపోవడంతో మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో అక్కడి వారు కేసు వెనక్కి తీసుకోవాలని తనను బెదిరించారని..అయినా వెనక్కి తగ్గకపోవడంతో కక్ష కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టులో జేసీబీతో చదును చేసేందుకు యత్నించారని..అడ్డుకోబోయిన తనను దూషించారని వాపోయారు రత్నం. సర్పంచ్‌ మాట వినకుంటే గ్రామంలో ఉండనీయనని బెదిరించారని చెప్పారు. వరుస ఘటనలతో తాను విసిగిపోయానని..మనోవేదనకు గురై ఓసారి గుండెపోటు వచ్చిందని లేఖలో తెలిపారు …అటు తరువాత పోరాటం కొనసాగించిన రైతు నిన్న గుండెపోటుతో కార్యాలయంలోనే కుప్పకూలి ప్రాణాలు వదలడం తీవ్ర కలకలం రేపింది…ఘటనపై రెవెన్యూ అధికారుల తీరుపై మృతుని కుటుంబసభ్యులు తీవ్రంగా మండిపడ్డారు.

వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందువల్ల తాము ఏమీ చేయలేమంటున్నారు అధికారులు…. ఈ ఘటనపై ఇటు టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. రత్నం కుటుంబసభ్యులక ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇప్పటికైనా ఆ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని.. ఆయన మృతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్​ చేశారు… ఇక రత్నం మృతి తరువాత కలెక్టర్ సూచనలతో వారి కుటుంబ సభ్యులకు రెండు ఎకరాలు పట్టా భూమీ ఇవ్వడానికి హామీ పత్రాన్ని రాసి ఇచ్చారు…అయినా రత్నం కుటుంబ సభ్యులు ఇంటి స్దలంతో పాటు ఉద్యోగం కావాలని కోరుతూ పెనుమూరు లో ధర్నాకు దిగారు.

ఈ ఘటనపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు… ప్రభుత్వ అసమర్ధతతోనే దీక్షలో రైతు మృతి…న్యాయం కోసం దీక్ష చేపట్టిన ఒక సామాన్య రైతు ప్రాణాలు కోల్పోవడం మానవీయతకు మాయని మచ్చ..ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. ఆటవిక అరాచక పాలనలో ఉన్నామా..?ప్రభుత్వం అలసత్వానికి రైతు బలైపోవడం అత్యంత దురదృష్టకరం…న్యాయస్థానం ఉత్తర్వులను అధికారులు పాటించినట్లయితే ఒక బడుగు రైతు ప్రాణాలు పోయి వుండేవి కాదు.. ఈ సంఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించకపోతే ప్రజాస్వామ్య పరమార్ధం కలుషితమవుతుంది అన్నారు పవన్ కళ్యాణ్. బీజేపీ నేతలు కూడా దీనిపై స్పందించారు. ప్రభుత్వంపై మండిపడ్డారు.

Read Also: Protein Food For Vegetarian: శాకాహారులకు ప్రొటీన్స్ కావాలంటే వీటిని తినాలి..

Exit mobile version