Fake Seeds: సీజన్ ప్రారంభ కాకముందే ఫేక్ సీడ్స్ ముఠాలు రంగంలోకి దిగాయి..అమాయక రైతులను ముంచేందుకు రెడి అయ్యారు. నాణ్యతలేని విత్తనాలను అంటగట్టే ముఠాలు మళ్లీ తమ పనికానిచ్చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో క్వింటాళ్ల కొద్ది నకిలీ విత్తనాలు సరఫరా ఏటా నిత్యకృత్యంగానే మారిపోతున్నాయి. అయితే ఇందులోపాత్రదారులెవ్వరు.. సూత్రదారులెవ్వరు… సహకరించే వ్యవస్థ ఎక్కడుంది..అన్నదాతను నిండాముంచుతున్న ఫేక్ సీడ్స్ కేటుగాళ్లపై ప్రత్యేక కథనం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఏటా నకిలీ విత్తనాలు రైతన్నలను కష్టాలపాలు చేస్తుంది. దిగుబడి రాక కొంతమంది పెట్టిన విత్తనాలు మొలకెత్తక మరికొంతమంది నష్టపోతూనే ఉన్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం కాకముందే విత్తన మాఫియా జిల్లాలో జడలువిప్పుతోంది. వేసవి ప్రారంభం కంటే ముందే లూజ్ విత్తనాలు డంప్ చేసుకుని మరీ తమ ఆగడాలకు పదునుపెడుతున్నారు. ముఠాలుగా ఏర్పడి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా తాండూర్ లో ఓ ముఠా టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కింది. స్టేషన్ పోలీసులు ఉన్నా టాస్క్ ఫోర్స్ పోలీసులు మాత్రమే పట్టుకోవడం అనుమానాలకు తావిస్తోంది. మరీ ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిదిలో క్వింటాళ్ల కొద్ది ఫేక్ సీడ్స్ వ్యాపారం చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. గతంలో భారీ సంఖ్యలో పట్టుకుని సీజ్ చేసి నిందితులపై కేసులు పెట్టినా.. ఆఖరికి పీడీ యాక్టులు సైతం అమలు చేసినా బుద్ధి మారలేదు కొందరికి.
Read Also: Etala Rajender: కేసీఆర్ మాటలకు పొంగిపోను.. అవమానాలను మర్చిపోను
తాజాగా తాండూరు మండలంలో ముగ్గురు వ్యక్తులు బొలెరా వాహనంలో పైన వడ్ల బస్తాలు.. లోపల నకిలీ పత్తివిత్తనాలు తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గింజల వాహనానికి ముందుగా పైలెట్ వాహనం సైతం ఏర్పాటు చేసుకున్నారు. రెండు వాహనాలు 5 క్వింటాళ్ల పత్తి విత్తనాలు సీజ్ చేశారు. అయితే ఇందులో మరో ఇద్దరు పరారీలో ఉండగా అందులో ఒక్కరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు సైతం ఉన్నాడు.
Read Also: Gold Chain Robbery: దొరలా వచ్చి గోల్డ్ చెయిన్ కాజేసిన కేటుగాడు
ఏటా కొన్ని ముఠాలు కొంతమంది రైతులను మచ్చిక చేసుకుని వాళ్ల ద్వారా సేల్స్ చేస్తున్నారు. ఏదైనా అయితే రైతులే అని చెప్పే విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఆంధ్రాతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన కొంతమంది వ్యక్తులు ఇక్కడ రైతులను మచ్చిక చేసుకుని ఈ దందా కొనసాగిస్తున్నారు. గతంలో పోలీసులు చాలామందిని అరెస్ట్ చేశారు. అలాగే రైతులను ముందుపెట్టి నకిలీ సీడ్స్ తో మోసం చేసే ముఠాలకు సహకరించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఫేక్ సీడ్స్ ముఠాలను అరికట్టాల్సిన అధికారులు మిన్నకుండి పోవడంతో అన్నదాత నిండామునుగుతున్నాడు. అయితే నకిలీ సీడ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు చెప్పుతున్నారు.