NTV Telugu Site icon

Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఇంకెప్పుడమ్మా!

Virat Kohli

Virat Kohli

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025కి ముందు టీమిండియాకు శుభవార్త. కొంత కాలంగా పరుగులు చేయడంలో ఇబ్బందిపడుతున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫామ్‌లోకి వచ్చాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ సెంచరీ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) బాదాడు. 30 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ, 76 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకుని మునుపటి రోహిత్‌ను తలపించాడు. చాలా నెలల తర్వాత హిట్‌మ్యాన్‌ సెంచరీ బాదడంతో ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కోహ్లీ వంతే మిగిలుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ.. ఇంకెప్పుడమ్మా నువ్ ఫామ్ అందుకునేది అని సరదాగా ట్వీట్స్ చేస్తున్నారు.

గత కొంతకాలంగా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఇటీవల ముగిసిన బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ ప్రదర్శనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఐదు టెస్టులో ఒక్క సెంచరీ మినహా రాణించిన దాఖలు లేవు. విరాట్ పని అయిపోయిందనే కామెంట్లూ వినిపించాయి. కింగ్ మాదిరే విఫలమైన రోహిత్ శర్మ.. ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు మునుపటి ఫామ్‌ అందుకున్నాడు. రెండో వన్డేలో కోహ్లీ మాత్రం తేలిపోయాడు. ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో 5 పరుగులకే క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ నేపథ్యంలో కోహ్లీ సైతం తిరిగి ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకూ 13 మ్యాచ్‌లు ఆడి 529 రన్స్ చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 96. కోహ్లీఐ ఛాంపియన్స్‌ ట్రోఫీనే చివరి ఐసీసీ టోర్నీ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బ్యాట్‌తో రాణించాల్సిన అవసరముంది. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఆరంభం కానుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, ఫిబ్రవరి 23న పాకిస్తాన్ జట్లతో భారత్ మ్యాచులు ఆడుతుంది.