Site icon NTV Telugu

IND vs AUS: జార్వో బాబాయ్ మళ్లీ వచ్చేశాడు.. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు అంతరాయం! రంగంలోకి కోహ్లీ

Jarvo 69

Jarvo 69

Pitch invader Jarvo 69 returns at IND vs AUS Match: కరోనా మహమ్మారి అనంతరం 2021లో భారత్‌, ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ సందర్భంగా పదే పదే భారత జెర్సీ ధరించి మైదానంలోకి వచ్చి మ్యాచ్‌కు అంతరాయం కలిగించిన ‘జార్వో 69’ గురించి మనకు తెలిసిందే. ఇంగ్లండ్‌ ప్రముఖ యూట్యూబర్‌ అయిన ‘జార్వో’.. అలియాస్ డేనియెల్‌ జార్విస్‌ మరోసారి మైదానంలోకి వచ్చాడు. వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ జెర్సీ ధరించిన జార్వో.. ఉన్నపళంగా మైదానంలోకి దూసుకొచ్చాడు.

ప్రపంచకప్‌ 2023లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదలెట్టిన కొద్ధి సేపటికే జార్వో మైదానంలోకి దూసుకొచ్చాడు. సెక్యూరిటీ కళ్లు కప్పి ఆటగాళ్ల వద్దకు పరుగెత్తాడు. దీంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది జార్వోను బయటికి పంపించే ప్రయత్నం చేయగా.. అతడు ససేమిరా అన్నాడు. దాంతో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రంగంలోకి దిగాడు. జార్వో దగ్గరికి వెళ్లి మాట్లాడిన కోహ్లీ.. అతడిని బయటకు పంపేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

జార్వో 69 చేసిన పనికి ఐసీసీ చర్యలు తీసుకుంది. ఇకపై ప్రపంచకప్ మ్యాచ్‌లకు హాజరుకాకుండా జార్వోపై నిషేధం విధించింది. ఇక ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా 9 వికెట్స్ కోల్పోయింది. 49 ఓవర్లలో 9 వికెట్స్ కోల్పోయిన ఆసీస్ 195 రన్స్ చేసింది.

Exit mobile version