NTV Telugu Site icon

Tirumala: కలకలం రేపిన ఈ-మెయిల్.. తిరుమలలో హై అలర్ట్..

Ttd

Ttd

Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువుదీరిన ఏడుకొండలపై ఒక్కసారిగా కలకలం రేగింది. తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు వచ్చిన ఓ సమాచారం అందరినీ ఆందోళనకు గురిచేసింది.. తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నారంటూ ఈ-మెయిల్ ద్వారా పోలీసులకు సమాచారం చేరవేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. దీంతో అప్రమత్తమైన పోలీసులు. శ్రీవారి ఆలయ పరిసరాలు, మాడవీధుల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.. ఇక, తిరుమలలో ఉగ్రవాదుల కదలికలు నిజమేనా అని తేల్చే పనిలో భాగంగా సీసీ కెమెరా ఫుటేజీని కూడా పరిశీలించారు.. మెయిల్ లో వచ్చిన సమాచారం ఆధారంగా తిరుమలలో జల్లేడ పట్టారు భద్రతాధికారులు.. మెయిల్ లో పేర్కొన్న సమయంలో సూచించిన ప్రదేశంలో ఎలాంటి సంచారం లేదని ఎగుర్తించారు.. మెయిల్ పంపిన వారి గురించి కూడా ఆరా తీసేపనిలో పడిపోయారు..

Read Also: RCB vs LSG: ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీ.. లక్నో సూపర్ జెయింట్స్‌పై సూపర్ విక్టరీ

మరోవైపు.. ఆ ఈ మెయిల్‌పై వివరణ ఇచ్చారు పోలీసులు.. తిరుమలలో టెర్రరిస్ట్‌ సంచారం అన్నట్లు వచ్చిన సమాచారం రూమర్స్ అని తేల్చారు.. మెయిల్ ద్వారా వచ్చింది ఫేక్ న్యూస్ వాటిని నమ్మకండి అని సూచించారు ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి.. మెయిల్ పంపిన వ్యక్తులు ఎవరు అనేదానిపై విచారణ చేపడుతున్నాం.. ఎవరో కావాలని ఈ మెయిల్ పంపునట్టు అనుమానిస్తున్నాం అన్నారు.. అయితే, తిరుమలలో టెర్రరిస్టులు ఉన్నారన్న ఫేక్‌ ప్రచారాన్ని నమ్మొద్దని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. మొత్తంగా తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నారంటూ వచ్చిన ఈ-మెయిల్‌ కలకలం రేపగా.. తనిఖీల తర్వాత అది నకిలీ ఈ మెయిల్‌ అని తేలడంలో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.