Vijayawada: విజయవాడలోని ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయంలో నకిలీ పత్రాల సృష్టించి అర్చక ఉద్యోగం పొందేందుకు జరిగిన ఒక కుట్ర వెలుగులోకి వచ్చింది. దేవాదాయ శాఖ అధికారుల కళ్లు గప్పి, ఏకంగా అపాయింట్మెంట్ ఆర్డర్ తెచ్చుకున్న ఒక వ్యక్తి ఉదంతం ఇప్పుడు ఇంద్రకీలాద్రిపై సంచలనంగా మారింది.
Yashasvi Jaiswal: ముంబై అంటేనే శివాలెత్తుతున్న జైస్వాల్.. బౌలర్లకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది!
ఘటన సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. 2022లో సాయిబాబు అనే అర్చకుడు మరణించారు. ఆయన మరణానంతరం ఆ ఖాళీ అయిన అర్చక పోస్టును దక్కించుకోవాలని దిలీప్ దత్తార అనే వ్యక్తి పన్నాగం పన్నాడు. తాను సాయిబాబు దత్తపుత్రుడినని నమ్మించేలా నకిలీ పత్రాలను సృష్టించి, దేవాలయ అధికారులను బోల్తా కొట్టించాడు. ఈ పత్రాల ఆధారంగా ఏకంగా దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుండి నియామక ఉత్తర్వులు (Appointment Order) కూడా పొందడం గమనార్హం.
దిలీప్ ఇలాంటి మోసానికి పాల్పడటం ఇది మొదటిసారి కాదు. 2009లో నామయ్య అనే అర్చకుడు మరణించినప్పుడు కూడా, ఆయన స్థానంలో ఉద్యోగం పొందేందుకు దిలీప్ ప్రయత్నించాడు. అయితే, తాజాగా సాయిబాబు మరణం తర్వాత మరోసారి నకిలీ పత్రాలతో రంగంలోకి దిగి అధికారులను పక్కదారి పట్టించాడు. దిలీప్ చేస్తున్న ఈ మోసాన్ని గమనించిన అతని సొంత పెదనాన్న కుమార్తె (2009లో చనిపోయిన నామయ్య పెద్ద కుమార్తె) కోడూరు లక్ష్మీ పద్మావతి ఆలయ ఈవో శీనా నాయక్‌కు రాతపూర్వక ఫిర్యాదు చేశారు. నిందితుడు తప్పుడు పత్రాలతో అధికారులను మోసం చేస్తున్నాడని ఆమె ఆధారాలతో సహా వివరించారు. దీంతో అప్రమత్తమైన ఈవో, ఆ నియామక ప్రక్రియను వెంటనే నిలిపివేసి విచారణకు ఆదేశించారు.
దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఎంత నిర్లక్ష్యంగా సాగుతుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. కనీస విచారణ లేకుండా నకిలీ పత్రాలకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఎలా ఇచ్చారనే దానిపై తోటి అర్చకులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరిపి, ఈ కుట్రలో ఎవరి పాత్ర ఉందో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దేవాదాయ శాఖ విచారణ కొనసాగుతోంది.
