Raithu Bheema: మెదక్ జిల్లాలో రైతు బీమా సొమ్ము కోసం చావు నాటకానికి తెరతీసిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మెదక్ జిల్లా గుట్టకిందిపల్లి గ్రామంలో బతికే ఉన్న ఇద్దరు రైతులు చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించి రైతు బీమా డబ్బులను దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ బాగోతం తాజాగా నిర్వహించిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేతో బయటపడింది. గ్రామానికి చెందిన శ్రీను, మల్లేశం అనే ఇద్దరు రైతులు రైతు బీమా డబ్బుల కోసం చనిపోయినట్లు నాటకం ఆడారు. ఈ కుంభకోణానికి మాజీ సర్పంచ్ కుమారుడు వెంకటేష్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడు. 2021లో శ్రీను చనిపోయినట్లు, 2023లో మల్లేశం చనిపోయినట్లు అధికారులను నమ్మించి గ్రామ పంచాయతీ నుంచి డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారు.
Also Read: Chalo Raj Bhavan: టీపీసీసీ ఆధ్వర్యంలో “చలో రాజ్‌భవన్”.. నిరసనల్లో పాల్గొననున్న సీఎం, డిప్యూటీ సీఎం
ఆ తర్వాత రైతుల భార్యలు అధికారుల ముందూ నాటకం ఆడటానికి సిద్ధమయ్యారు. చావు నాటకంలో ఎవరికీ అనుమానం రాకుండా తమ బొట్టును తీసేసి, గాజులను తీసేసి చనిపోయిన వారి భార్యలుగా నటించారు. గ్రామస్థుల సాక్ష్యాన్ని కూడా సమకూర్చడంలో వెంకటేష్ చాకచక్యంగా వ్యవహరించాడు. దాంతో డెత్ సర్టిఫికెట్ ఆధారంగా ఇద్దరు రైతుల పేరుపై దరఖాస్తు చేసి పది లక్షల రూపాయల బీమా సొమ్ము పొందారు. అందిన డబ్బు నుంచి కొంత మొత్తాన్ని వెంకటేష్ తీసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ వ్యవహారంపై ఎటువంటి అనుమానాలు రాకుండా కొన్నాళ్లపాటు మాయమైపోయారు.
Also Read: Loan App Harassment: లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక యువకుడి ప్రాణం బలి
అయితే, తాజాగా ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా భర్తలు చనిపోయారని చెప్పిన భార్యలపై గ్రామస్థులు అనుమానించారు. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దానితో గ్రామానికి చేరుకున్న పోలీసుల విచారణ మొదలయ్యేలోపే శ్రీను, మల్లేశం కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసుకుని పరారయ్యారు. ప్రస్తుతం పోలీసులు విచారణ ముమ్మరం చేసి, మోసానికి పాల్పడిన వారిని పట్టుకునే పనిలో ఉన్నారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో దారుణమైన వ్యవహారాలకు నిదర్శనంగా నిలిచింది. ప్రభుత్వ బీమా పథకాలపై ఎటువంటి లోపాలు లేకుండా మరింత నిఘా అవసరమని స్థానికులు అభిప్రాయపడ్డారు.