Suryapet: సూర్యాపేట జిల్లా కేంద్రంలో నకిలీ గుండె వైద్యుడు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. శరత్ కార్డియాక్ కేర్ సెంటర్‌పై వచ్చిన ఫిర్యాదును ఆధారంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అనుమతులు కార్డియాక్ డాక్టర్ పేరుతో తీసుకున్నప్పటికీ, వైద్య సేవలు మాత్రం కేవలం ఎంబిబిఎస్ అర్హత కలిగిన డాక్టర్ నిర్వహిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. గుండె సంబంధిత వైద్య సేవల పర్యవేక్షణలో అనుభవం లేకపోయిన డాక్టర్, గుండె సంబంధిత జబ్బులకు చికిత్స చేస్తూ.. 2D ఈకో వంటి ముఖ్యమైన టెస్టులు నిర్వహిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇది వైద్య నైతికతకు విరుద్ధమని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న చర్య అని అధికారులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై ఆసుపత్రిని నిర్వహిస్తున్న డాక్టర్లపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) చట్టం ప్రకారం ఫోర్జరీ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఆసుపత్రి అనుమతుల విషయంలో మోసపూరితంగా వ్యవహరించినందుకు సంబంధిత అధికారులను కూడా విచారించనున్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయాల్లో ఇలాంటి నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదాన్ని కలిగించగలదో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. సంబంధిత వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.