Fake Bank: మీరు చూస్తున్నది నిజమేనండి.. ఓ ఘరానా కేటుగాడు ఏకంగా నకిలీ బ్యాంకులనే ఏర్పాటు చేశాడు. ఉద్యోగులను నియమించుకుని బ్యాంకుకు ఏ మాత్రం తగ్గకుండా కార్యకలాపాలు చేపట్టాడు. ఖాతాలు తెరవడమే కాకుండా డిపాజిట్లు కూడా తీసుకున్నాడు. మొత్తం 9 బ్రాంచీలను తెరిచి దందా కొనసాగిస్తున్నాడు ఆ కేటుగాడు. ఎలా అనుమానం వచ్చిందో, లేదంటే ఎవరైనా బాధితులు సమాచారం ఇచ్చారో కానీ.. ఒకేసారి తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల్లో పుట్టిన బ్యాంక్‌లపై పోలీసులు ఏకకాలంలో స్టింగ్ ఆపరేషన్ చేశారు. మొత్తం 9 జిల్లాల్లో విస్తరించిన నకిలీ బ్యాంక్‌ల గుట్టును ఛేదించారు.
గతంలో ఫేక్ కరెన్సీ, ఫేక్ ఉద్యోగాలు, ఫేక్ సర్టిఫికేట్లు, ఇతర ముఠాల గురించే అందరూ చూసే ఉంటారు. కానీ నిజమైనా బ్యాంకులను పోలిన ఉత్తుత్తి బ్యాంకులను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావచ్చు. తమిళనాడుకు చెందిన చంద్రబోస్ అనే యువకుడు చెన్నైలో ఓ బ్యాంకును తెరిచాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ‘గ్రామీణ రైతుల సహకార బ్యాంకు’ అని పేరు పెట్టాడు. చెన్నై సహా తొమ్మిది చోట్ల బ్రాంచీలు కూడా ఏర్పాటు చేశాడు. లండన్‌లో చేసిన ఎంబీయే డిగ్రీ, గత ఉద్యోగ అనుభవంతో పకడ్బందీగా బ్యాంకును ఏర్పాటు చేశాడు ఆ యువకుడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తమ బ్యాంకుకు గుర్తింపు ఉందని చూపించుకునేందుకు ఓ నకిలీ ధ్రువపత్రాన్ని తయారు చేశాడు. మిగతా బ్యాంకుల తరహాలోనే డిపాజిట్, విత్ డ్రా స్లిప్పులు, స్టాంపులతో పాటు సిబ్బందిని నియమించుకుని బ్యాంక్‌ను నడిపించాడు. ఉద్యోగం ఇవ్వడానికి కూడా రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల దాకా వసూలు చేశాడట.
Gold Buying: బంగారంపై దృష్టిసారించిన బ్యాంకులు.. టాప్‌లో ఆర్బీఐ..
చెన్నైలో తొలి ప్రయత్నం విజయవంతం కావడంతో.. చెన్నై సహా మధురై, నామక్కల్, సేలం, ఈరోడ్ జిల్లాల్లోనూ వేరు వేరు పేర్లతో బ్యాంకులను విస్తరించాడు. అయితే, అనతి కాలంలో పుట్టగొడుగుల్లా బ్యాంకులు పుట్టుకురావడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే రంగంలోకి దిగి స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఈ వ్యవస్థ అంతా వట్టి ఫేక్ అని పోలీసులు తేల్చారు. ఉత్తుత్తి బ్యాంకులో సిబ్బందిగా పని చేస్తున్న అందరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ప్రస్తుతానికి రూ. 60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 46 మందిని మేనేజర్లు, క్యాషియర్లు, క్లర్కుల పేరుతో నియమించుకున్నాడు. కొత్త ఖాతాలను తెరవడంతో పాటు, డిపాజిట్ల పేరుతో రూ. 2 కోట్ల వరకు ప్రజల నుంచి వసూలు చేశాడు. తమిళనాడులో నడుస్తున్న ఈ బ్యాంకు వ్యవహారం రిజర్వ్ బ్యాంక్ దృష్టికి వెళ్లింది. దీంతో ఈ బ్యాంకుకు గుర్తింపు లేదని, ఫోర్జరీ సర్టిఫికెట్ తో బ్యాంకును తెరిచారని పోలీసులకు ఆర్బీఐ తెలిపింది. బ్యాంకు బ్రాంచీలను అన్నింటినీ మూసేసినట్లు చెన్నై సిటీ పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ వివరించారు.