Site icon NTV Telugu

Eye Health Tips: కంటి చూపు మెరుగుపడాలంటే.. ఈ ఆహారాలు తినండి! గ్రద్ద లాంటి చూపు మీ సొంతం

Eye Health Tips

Eye Health Tips

How to improve eyesight naturally: ‘గ్రద్ద’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాల్లో ఎగురుతూ.. ఆహరం కోసం భూమీద ఉండే ప్రతి దాన్ని కంటి చూపుతో పసిగడుతుంది. గాల్లోనే ఉండి చిన్న చిన్న కీటకాలు, పక్షులు, జంతువులను కూడా స్పష్టంగా చూస్తుంది. అందుకే గ్రద్ద లాంటి చూపు అవసరం అని అంటుంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే కళ్లద్దాలు పెట్టుకుని కనిపించేవారు ఎక్కువగా ఉన్నారు. ఫోన్, కంప్యూటర్, టీవీల స్క్రీన్ టైం ఎక్కువ కావడం వల్ల కంటి చూపు బలహీనం అవుతుంది. అంతేకాదు కంటి చూపుకు అవసరమైన పోషకాహారం తీసుకోకపోవడం కూడా మరో కారణం. గ్రద్ద లాంటి చూపు మీ సొంతం కావాలంటే.. ఈ కింది ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి.

విటమిన్ ఎ:
కళ్లకు ఉత్తమమైన పోషకం విటమిన్ ఎ. రెటీనాకు తగినంత విటమిన్ ఎ అవసరం. సూర్యుడి హానికరమైన కిరణాల నుండి కళ్లను రక్షించడంలో సహాయపడతాయి. విటమిన్ ఎ లేకుంటే మీ కళ్లు పొడిబారిపోయాయి.

క్యారెట్స్:
కళ్లకు మేలు చేయటంలో క్యారెట్లను మించినవి మరొకటి లేదు. క్యారెట్‌లోని విటమిన్‌ ఎ కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

చిలగడదుంప:
చిలగడదుంపలు (స్వీట్ పొటాటో) విటమిన్ ఎని పుష్కలంగా అందిస్తాయి. చిలకడదుంపలలో ఉండే బీటా కెరోటిన్ కళ్లకు చాలా మేలు చేస్తుంది. కళ్లు పొడిబారడాన్ని తగ్గించడమే కాకుండా.. కంటి చూపును బలంగా ఉంచుతుంది.

ఆకుకూరలు:
ఆకుకూరలు తింటే కంటి చూపు బాగా ఉంటుంది. లుటిన్, జియాక్సంతిన్ అని పిలువబడే యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో ఉంటాయి. ఇవి సూర్యుడి హానికరమైన కిరణాల నుండి కళ్లను రక్షిస్తాయి. పాలు, ఛీజ్‌, గుడ్డు (పచ్చసొన) వంటి వాటిల్లోనూ విటమిన్‌ ఎ ఉంటుంది. పుచ్చకాయలు విటమిన్ ఎ కి మంచి వనరులు.

విటమిన్ సి:
కంటి ఆరోగ్యానికి విటమిన్ సి చాలా ముఖ్యం. యాంటీఆక్సిడెంట్‌గా విటమిన్ సి పర్యావరణ కారకాల వల్ల కలిగే నష్టం నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. వేయించిన ఆహారాలు, పొగాకు, సూర్య కిరణాలు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతీసే అణువులు. విటమిన్ సి కణాల పెరుగుదలకు సహాయపడుతుంది.

నారింజ పండు, ద్రాక్షపండ్లు, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లను ఎక్కువగా తినాలి. క్యాప్సికమ్, టమోటాలు, స్ట్రాబెర్రీలు కూడా విటమిన్ సిని అందిస్తాయి. తాజా పండ్లలో కూడా విటమిన్‌ సి, విటమిన్‌ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. మంచి కంటి చూపు కోసం తీసుకొనే ఆహారంలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ ఎ, సిలు ఉండేటట్లు చూసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలతో పాటు ఒమేగా-3 ఉండే చేపలను కంటి చూపు మెరుగు పడేందుకు దోహదపడతాయి. అన్నింటితో పాటు ప్రశాంతంగా నిద్రపోవడం ద్వారా కళ్లకు కావాల్సిన విశ్రాంతి లభిస్తుంది.

Exit mobile version