NTV Telugu Site icon

Kesineni Nani: తమ్ముడి గెలుపు.. అన్న ముగింపు..! చర్చగా మారిన కేశినేని వ్యవహారం..

Kesineni

Kesineni

Kesineni Nani: పదేళ్లపాటు బెజవాడ ఎంపీగా పనిచేసిన కేశినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున బెజవాడ ఎంపీగా వరుస విజయాలు సాధించారు కేశినేని నాని. 2024 ఎన్నికల్లో మాత్రం వైసీపీ తరపున బరిలోకి దిగినా.. ఆయన సొంత సోదరుడు కేశినేని చిన్ని చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ పరాజయంతో తర్వాత అనేక సమాలోచనలు జరిపి చివరికి రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకు న్నట్టు కేశినేని నాని ఎక్స్ (ట్విట్టర్‌)లో పోస్ట్ చేశారు. కొత్తగా గెలిచిన వారు బెజవాడను అభివృధ్ధి చేయాలని ఆకాక్షించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నా బెజవాడ అభివృద్ధికి తన మద్ధతు ఉంటుందని చెప్పారు కేశినేని నాని. తనకు రెండుసార్లు ఎంపీగా గెలిచిన బెజవాడ పార్లమెంట్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

2009 ఎన్నికల సమయంలో తొలుత కేశినేని నాని ప్రజారాజ్యంలో చేరారు. అయితే టికెట్ల కేటాయింపుతోపాటు ఇతర అంశాలు విషయంలో చిరంజీవితో గ్యాప్ రావటంతో ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2014లో తొలిసారి టీడీపీ ఎంపీ బెజవాడ నుంచి గెలిచారు. అదే సమయంలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ టీడీపీలో కొందరు నేతల తీరుతో విసుగెత్తి వారిపై బహిరంగ విమర్శలు చేయటం ద్వారా నాని చర్చనీయాంశంగా మారారు. ఆ తర్వాత ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం విషయంలో కేశినేని నానిపై చంద్రబాబు వ్యవహరించిన తీరుతో మన స్తాపానికి గురై సైలెంటయ్యారు. 2019లో రెండోసారి టికెట్ తెచ్చుకున్న కేశినేని నాని.. వైసీపీ హవాలో కూడా బెజవాడ నుంచి గెలిచారు. రెండోసారి గెలిచిన దగ్గర నుంచి కేశినేని నానికి పార్టీ నేతలకు మధ్య రచ్చ మొదలైంది. అప్పటి వరకు సఖ్యతగా ఉన్న కేశినేని నాని, బుద్ధా వెంకన్న, బోండా ఉమా, నాగుల్ మీరా మధ్య గొడవలు మొదలై అవి మున్సిపల్ ఎన్నికల నాటికి రచ్చకెక్కాయి.

కేశినేని నాని చంద్రబాబు, లోకేష్ లతో వ్యవహరించిన తీరుతో అధిష్టానం కూడా కేశినేని నానిపై గుర్రుగా ఉంది. చంద్రబాబు బొకే ఇచ్చే సమయంలో నెట్టేయటం వంటి వీడియోలు వైరల్ గా మారటంతో పార్టీలో కేశినేని కుదురుకోలేకపోయారు. ఇదే సమయంలో కేశినేని నానికి ప్రత్యామ్నాయంగా ఆయన సొంత సోదరుడు కేశినేని చిన్నిని రంగంలోకి దింపింది టీడీపీ అధిష్టానం. నాని పార్టీలో ఉండగానే చిన్నికి పార్లమెంట్ పరిధిలో ప్రాధాన్యత ఇచ్చింది. పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల సమన్వయ కర్తలు కూడా నానికి దూరంగా ఉంటూ చిన్నితో కార్యకలాపాలు నిర్వహించటంతో చిర్రెత్తిన నాని.. వైసీపీ ఎమ్మెల్యేలకు నిధులు ఇచ్చి వారితోపాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా టీడీపీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేశారు. ఇదంతా జరుగుతున్న క్రమంలో తిరువూరులో చంద్రబాబు మీటింగ్ కి అటు కేశినేని నాని, ఇటు కేశినేని చిన్ని వర్గాలు వెళ్లటంతో రెండు వర్గాలు బాహాబాహకి దిగి గొడవైంది.

ఇక, ఈ గొడవతో కేశినేని నానిని ఆ కార్యక్రమానికి దూరంగా ఉండాలని తిరువూరు సభ వ్యవహారాలు కేశినేని చిన్ని చూస్తారని పార్టీ దూతలు చెప్పటంతో మరింత రగిలిపోయారు కేశినేని నాని. ఆ సమయంలోనే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయనతోపాటు ఆయన కుమార్తె స్వేత కూడా పార్టీకి రాజీనామా చేసింది. ఆ తర్వాత 2023 చివర్లో కేశినేని నాని వైసీపీలో చేరి ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు, టీడీపీపై నిప్పులు చెరిగేలా విమర్శలు చేశారు. తనపై పోటీకి దిగిన సోదరుడు కేశినేని చిన్నిపై కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శలు చేశారు. ఎన్నికల ఫలితాలు చూస్తే బెజవాడ పార్లమెంట్ ఏర్పడిన తర్వాత రానంత మెజార్టీతో చిన్ని గెలిచారు. దీంతో ఇక రాజకీయాలకు ముగింపు పలకాలని డిసైడైన నాని గుడ్ బై చెబుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Show comments