TDP and Janasena: రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌కు కౌంటర్ ఇచ్చారు టీడీపీ, జనసేన నేతలు.. బహిరంగ సభలో చెప్పు చూపిస్తావా, నువ్వెంత ? నీ స్థాయి ఏమిటి? అని రాజమండ్రి మార్గాని భరత్ పై మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు విరుచుకు పడ్డారు. వాలంటీర్ ను ప్రశ్నించడానికి నాకు అర్హత లేదా అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోతే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని చెపుతున్న ప్రచారంపై ఆ వాలంటీర్ ను వివరణ అడిగాననీ అప్పారావు చెప్పుకొచ్చారు. ఆ అమ్మాయి తాను అలా చెప్పడం లేదని ఫోన్ లో చెప్పుకొచ్చిందన్నారు. సోమవారం రాత్రి సుబ్రహ్మణ్యం మైదానంలో నిర్వహించిన రాజమండ్రి సిద్ధం సభలో ఎంపీ భరత్ చెప్పు చూపించి ఆదిరెడ్డి అప్పారావును చెప్పుతో కొట్టాలని చేసిన వ్యాఖ్యల పై మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి, రాజమండ్రి సిటీ జనసేన ఇంఛార్జి అత్తి సత్యనారాయణలు త్రీవ్రంగా మండి పడ్డారు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టెన్షన్ లో పడి ఎంపీ భరత్ ఏమీ మాట్లాడుతున్నాడో కూడా తెలియడం లేదన్నారు అదిరెడ్డి. నీకు సంస్కారం వుందా అని భరత్ ను ప్రశ్నించారు. ఎంపీగా గెలిసిన తర్వాత ఎప్పుడైనా మిగిలిన నియోజకవర్గాలకు వెళ్లావా? ఎందుకు వెళ్లలేకపోయావు అంటూ ధ్వజమెత్తారు. రాజమండ్రి సిటీలో ఎంపీగా గత ఎన్నికలలో నీకు టీడీపీ అభ్యర్థి కంటే 28 వేల తక్కువ ఓట్లు వచ్చాయి అనేది నీకు గుర్తుందా..? అని ప్రశ్నించారు. అభివృద్ధికి పార్లమెంట్ నిధులేమైనా ఖర్చు చేసావా? అని నిలదీశారు. నీ అభివృద్ది ఏమిటో మెయిన్ రోడ్ చూస్తూనే తెలుస్తుందని, వ్యాపారులు అంతా వద్దంటే వేసిన సెంట్రల్ లైటింగ్ ను ఇప్పుడు తీసేస్తాను అంటున్నావు.. మరి ఆ ఖర్చు దుర్వినియోగం కాదా? అని ఆదిరెడ్డి దుయ్యబట్టారు. నీది ఫెయిల్యూర్ సినిమా అని, నువ్వు ఒక సినిమాలో నటిస్తే రెండో రోజే అగిపోయిందని విమర్శించారు. అలాగే సినిమా సెట్టింగులు లా రాజమండ్రిని మారుస్తున్నావు.. అంటూ విమర్శించారు.
ఇక, జనసేన రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అత్తి సత్యనాయణ ఎంపీ భరత్‌పై మండిపడ్డారు.. వాలంటీర్స్ కు మేము వ్యతిరేకం కాదన్నారు. వాలంటీర్ తో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడిన దానిలో తప్పేముందని నిలదీశారు. ఏడు నియోజక వర్గాలకు ఎంపీవా, రాజమండ్రి సిటీకా అని ప్రశ్నించారు.. బలుపుతో నీ తండ్రి వయస్సున్న ఆదిరెడ్డి అప్పారావును సభలో చెప్పు చూపించి కొడతానని బెదిరిస్తావా..? రౌడీయిజం చేస్తున్నావా? అంటూ ధ్వజమెత్తారు. ఇలాగే రౌడీగా వ్యవహరిస్తే బెల్ట్ దెబ్బలు పడతాయని అన్నారు. ఎంపీ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని, ఎంపీ భరత్ కార్పొరేటరా ఎంపీయో ప్రజలకు తెలియడం లేదని సెటైర్లు వేశారు.. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని, చేసిన అభివృద్దిపై శ్వేతపత్రం ప్రకటించాలని ఎంపీ భరత్ ను డిమాండ్ చేశారు అత్తి సత్యనారాయణ.