పార్టీ మారేవాళ్లను సముదాయిస్తాం కానీ.. కాళ్లు పట్టుకోలేమని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాల నుంచి వచ్చిన తరువాత పార్టీలో తాజా పరిణామాలపై చర్చిస్తామని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేక టీడీపీ రాజ్యసభ సభ్యులు ఏకంగా పార్టీలు మారిపోయారని విమర్శించారు. తనపై హోంమంత్రి చేసే వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం లేదని, హోంమంత్రి రీల్స్ చూసుకుని కాలక్షేపం చేసేస్తే మంచిదని అమర్నాథ్ ఎద్దేవా చేశారు.
విశాఖలో మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ… ‘వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాల నుంచి వచ్చిన తరువాత పార్టీలో తాజా పరిణామాలపై చర్చిస్తాం. పార్టీ మారేవాళ్లను సముదాయిస్తాం కానీ.. కాళ్లు పట్టుకోలేము. గతంలో చంద్రబాబు మీద నమ్మకం లేక టీడీపీ రాజ్యసభ సభ్యులు ఏకంగా పార్టీలు మారిపోయారు. జగన్ మోహన్ రెడ్డి టార్చ్ బేరర్. ఒక మనిషి లేకపోయినా రాజకీయం ఆగిపోదు. నాయకులను తయారు చేసుకునే శక్తి జగన్ రెడ్డికి ఉంది. బెదిరింపులు ద్వారా నాయకులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. కొంత మంది తట్టుకుంటారు, మరికొందరు తట్టుకోలేరు.. నాపైన విజిలెన్స్ విచారణ జరుగుతోంది’ అని అన్నారు.
‘దావోస్ నుంవి ఉత్తిచేతులతో తిరిగి వచ్చి ఇప్పుడు మిథ్య అంటున్నారు. 10 సార్లు వెళ్ళి వచ్చిన తర్వాత కానీ దావోస్ మిథ్య అనేది అర్థం కాలేదా?. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రతిష్ట కంటే రెడ్ బుక్ గురించి విదేశాల్లో సైతం మాట్లాడుకోవడం కనిపిస్తోంది. ప్రజల పక్షాన మా పోరాటం కొనసాగుతుంది. నాపై హోంమంత్రి చేసే వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం లేదు. హోంమంత్రి రీల్స్ చూసుకొని కాలక్షేపం చేసేస్తే మంచిది’ అని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు.