NTV Telugu Site icon

Pak vs Eng: పాకిస్థాన్‌తో టెస్ట్‌లో చరిత్ర సృష్టించిన ఇంగ్లీష్ జట్టు.. 112 ఏళ్ల రికార్డు బ్రేక్..

Pak Vs Eng

Pak Vs Eng

Pak vs Eng: పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఇవాళ ప్రారంభమైన మొదటి టెస్టులో ఇంగ్లీష్‌ జట్టు చరిత్ర సృష్టించింది. టెస్టు మ్యాచ్‌ తొలిరోజే 500 పరుగులు చేసిన మొదటి జట్టుగా రికార్టు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ జట్టు తొలి రోజే 4 వికెట్లు కోల్పోయి 506 పరుగుల స్కోర్‌ చేసి, క్రికెట్‌ చరిత్రలో తొలి రోజు అత్యధిక స్కోర్‌ చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ క్రమంలో 112 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. ఆస్ట్రేలియా పేరిట 112 ఏళ్లుగా పదిలంగా ఉన్న ఈ రికార్డును ఇంగ్లండ్ నేడు బద్దలు కొట్టింది. 1910లో దక్షిణాఫ్రికాపై ఆసీస్ జట్టు తొలిరోజున 494 పరుగులు చేసింది. అయితే ఈ రికార్డును బెన్ స్టోక్స్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు తెరమరుగు చేసింది. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో నేటి వరకు ఇదే తొలి రోజు అత్యధిక స్కోర్‌గా కొనసాగింది. తాజాగా ఇంగ్లండ్‌ తొలి రోజు అత్యధిక స్కోర్‌ చేసిన రికార్డుతో పాటు తొలి రోజు 500 పరుగుల సాధించిన తొలి జట్టుగానూ రికార్డు పుటల్లోకెక్కింది. 

రావల్పిండిలో నేడు ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్‌ టాపార్డర్ ఆటగాళ్లు ఆతిథ్య పాకిస్థాన్‌ బౌలర్లను చీల్చి చెండాడారు. వెలుతురు లేమి కారణంగా తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 75 ఓవర్లలో 4 వికెట్లకు 506 పరుగులు చేసింది. ఏకంగా నలుగురు బ్యాటర్లు శతకాలు బాదడం విశేషం. ఓపెనర్లు వచ్చిన జాక్‌ క్రాలే (122), బెన్ డకెట్ (107) తొలి వికెట్‌కు 233 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పగా.. అనంతరం వచ్చిన ఓలీ పోప్ (108) కూడా సెంచరీ సాధించారు. మాజీ కెప్టెన్‌ జో రూట్ 23 పరుగులకే ఔట్‌ కాగా.. తొలి రోజు ఆట చివర్లో వచ్చిన బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడికి జోడీగా క్రీజులో కెప్టెన్‌ బెన్ స్టోక్స్ ఉన్నాడు. దూకుడుగా ఆడుతున్న స్టోక్స్ 15 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు.

UN Security Council: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన భారత్

ఈ రికార్డుతో పాటు తొలి సెషన్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగానూ ఇంగ్లండ్‌ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌ తొలి సెషన్‌లో 27 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 174 పరుగులు చేసిన ఇంగ్లండ్‌.. టీమిండియా పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. 2018లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తొలి సెషన్‌లో 158 పరుగులు స్కోర్‌ చేసింది. తాజాగా ఇంగ్లండ్‌.. ఈ రికార్డును కూడా బద్దలు కొట్టింది.