Site icon NTV Telugu

Bhatti Vikramarka: మహిళలను కోటీశ్వరులుగా తయారు చేస్తాం.. ఇదే ప్రజాప్రభుత్వం లక్ష్యం

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Deputy CM Bhatti Vikrmarka: ప్రతి మహిళను మహాలక్ష్మిగా గౌరవిస్తామని.. వారిని కోటీశ్వరులుగా తయారు చేస్తామని.. ఇదే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున శిల్పారామం దగ్గర డ్వాక్రా మహిళా సంఘాలు తయారుచేసిన ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఏర్పాటు చేసిన మహిళా శక్తి బజారును ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించామన్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ దస్పల్లా హోటల్‌లో జరిగిన అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా 31వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడారు.

Read Also: TG Cabinet: ఈ నెల 30న తెలంగాణ కేబినెట్ భేటీ

ఈ ఏడాది డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు రూ. 20 వేల కోట్ల రుణాలు వడ్డీ లేకుండా ఇప్పించి వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో వడ్డీ లేకుండా లక్ష కోట్ల రూపాయల రుణాలను మహిళలకు ఇచ్చి కోటీశ్వరులుగా తయారు చేస్తామన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన స్థలాన్ని ప్రభుత్వం మహిళలకు ఇస్తుందన్నారు. పెట్టుబడికి బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పిస్తుందని వెల్లడించారు. అంబానీ, అదానీలనే కాకుండా సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటులో ప్రజా ప్రభుత్వం మహిళలను భాగస్వామ్యం చేసిందన్నారు.

Read Also: HYDRA: చెరువుల ఆక్రమ‌ణ‌ల‌పై ఫిర్యాదు.. రంగంలోకి రంగనాథ్

మహిళలు సోలార్ పవర్ ప్లాంట్‌లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తుందని డిప్యూటీ సీఎ తెలిపారు. వారు ఉత్పత్తి చేసిన విద్యుత్తును గ్రిడ్జ్ ద్వారా కొనుగోలు చేసి వారికి ప్రతి నెల బిల్లులను చెల్లిస్తుందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు కోటి మందికి పైగా మహిళలు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేశారన్నారు. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో మహిళల ఆలోచనలో మార్పు వచ్చిందని.. ప్రపంచంలో ఉండే అవకాశాలను అందిపుచ్చుకోవాలాని ఆలోచిస్తున్నారన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. అదే విధంగా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అవార్డులను మహిళలకు అందజేశారు.‌

Exit mobile version